
జీడిమెట్ల డిపో వద్ద...
♦ ఆర్టీసీ గుర్తింపు ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ ఘనవిజయం
♦ 27 డిపోల్లో విజయకేతనం
సాక్షి, సిటీబ్యూరో: గ్రేటర్ ఆర్టీసీ గుర్తింపు కార్మిక సంఘం ఎన్నికల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ (టీఎంయూ) ఘన విజయం సాధించింది. నగరంలోని అన్ని డిపోల్లో సమీప ప్రత్యర్థి కార్మిక సంఘాలు ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్‌లపై స్పష్టమైన ఆధిక్యం ప్రదర్శించింది. దీంతో ఆర్టీసీ టీఎంయూ వర్గాల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. వీఎస్‌టీ వద్ద ఉన్న సంఘం కార్యాలయం వద్ద కార్మికులు, యూనియన్ నాయకులు పెద్దఎత్తున సంబరాలు జరుపుకొన్నారు. బాణాసంచా పేల్చారు. మిఠాయీలు పంచుకొని ఒకరికొకరు అభినందనలు తెలుపుకొన్నారు.
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత జరిగిన మొట్టమొదటి ఎన్నికలు కావడంతో అన్ని సంఘాలు ప్రతిష్టాత్మకంగానే భావించాయి. మొత్తం 10 కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీ చేయగా అధికార టీఆర్‌ఎస్ పార్టీ అనుబంధ సంఘమైన టీఎంయూకే ఆర్టీసీ కార్మికులు పట్టం కట్టారు. గ్రేటర్ హైదరాబాద్ జోన్‌లోని 28 డిపోల్లో మెజారిటీ డిపోలను టీఎంయూ కైవసం చేసుకొంది. అన్ని డిపోలు, ఆర్టీసీ కార్యాలయాల్లో పని చేస్తున్న సుమారు 21 వేల మందికి పైగా కార్మికుల్లో 97 శాతం మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.
ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి. తెలంగాణ మజ్దూర్ యూనియన్, టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్, నేషనల్ మజ్దూర్ యూనియన్, తెలంగాణ ఆర్టీసీ బహుజన కార్మిక సంఘం తదితర పది కార్మిక సంఘాలు ఈ ఎన్నికల్లో పోటీకి నిలిచాయి.
27 డిపోల్లో టీఎంయూ గెలుపు
గ్రేటర్ హైదరాబాద్‌లో 28 డిపోల్లో 27 డిపోలను టీఎంయూ దక్కించుకుంది. ఒక్క హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ (హెచ్‌సీయూ) డిపో మాత్రమే ఎంప్లాయీస్ యూనియన్ గెలుచుకుంది. మిగతా ముషీరాబాద్–1, ముషీరాబాద్–2, మహేశ్వరం, చెంగిచెర్ల, హయత్‌నగర్, కంటోన్మెంట్, బర్కత్‌పురా, బండ్లగూడ, బీహెచ్‌ఈఎల్, ఉప్పల్, దిల్‌సుఖ్‌నగర్, కంటోన్మెంట్, హకీంపేట్, కుషాయిగూడ, ఫలక్‌నుమా, మెహదీపట్నం, రాజేంద్రనగర్, రాణిగంజ్–1, రాణిగంజ్–2,ఇబ్రహీంపట్నం, మిధాని, జీడిమెట్ల, మియాపూర్–1, మియాపూర్–2, మేడ్చల్, కూకట్‌పల్లి, పటాన్‌చెరు డిపోల్లో తెలంగాణ మజ్దూర్ యూనియన్ గెలిచింది. అన్ని చోట్ల ఎంప్లాయీస్ యూనియన్‌పైన విజయం సాధించింది.
అప్పుడు స్నేహితులు...ఇప్పుడు ప్రత్యర్థులు
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో కలిసి పనిచేసిన టీఎంయూ, ఎంప్లాయీస్ యూనియన్‌లు రాష్ట్ర విభజనకు ముందు జరిగిన ఎన్నికల్లో కలిసి పోటీ చేశాయి. తమ ప్రత్యర్థి అయిన ఎన్‌ఎంయూపైన ఉమ్మడిగా విజయం సాధించాయి. గుర్తింపు సంఘం ప్రతినిధులుగా రెండు సంఘాల ప్రతినిధులు ప్రాతినిధ్యం వహించారు.
రాష్ట్ర ఆవిర్భావం అనంతరం రెండు సంఘాలు విడిపోయి ప్రత్యర్థులుగా నిలిచాయి. టీఎంయూ ఈ ఎన్నికల్లో ఒంటరిగానే పొటీ చేయగా, ఎంప్లాయీస్ యూనియన్ మాత్రం ఎస్‌డబ్ల్యూఎఫ్, ఇతర కార్మిక సంఘాలను కలుపుకొని ఎన్నికల్లో నిలిచింది. అయినప్పటికీ ఎంప్లాయీస్ యూనియన్ ఈ ఎన్నికల్లో ఒక్క డిపోకు మాత్రమే పరిమితం కావలసి వచ్చింది. అధికార టీఆర్‌ఎస్ పార్టీకి అనుబంధంగా ఉన్న టీఎంయూవైపే కార్మికులు మొగ్గు చూపారు.