
వర్క్ షాపులను సద్వినియోగం చేసుకోవాలి
కడప అర్బన్ :
పోలీసు శాఖ నిర్వహించే వర్క్ షాప్‌లను పోలీసు అధికారులు, సిబ్బంది సద్వినియోగం చేసుకుని నైపుణ్యాన్ని మరింత పెంచుకునేందుకు కృషి చేయాలని జిల్లా అదనపుఎస్పీ పీవీజీ విజయకుమార్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ అత్యాచార నిరోధక చట్టం పై వర్క్‌షాపు రెండవ రోజు బుధవారం కడపలోని జెడ్పీ ఆవరణంలో గల వైఎస్‌ఆర్ స్మారక సమావేశ మందిరంలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో మరిన్ని వర్క్ షాపులు నిర్వహిస్తామని తెలిపారు. సంబంధిత విషయ నిపుణులచే వర్క్‌షాపు నిర్వహించడం వలన సిబ్బందికి విషయ పరిజ్ఞానం పెరిగేందుకు దోహద పడుతుందన్నారు.
పబ్లిక్ ప్రాసిక్యూటర్ టి. జయలక్ష్మి వివిధ చట్టాలు, సెక్షన్‌ల వారీగా ఏఏ కేసుల్లో పోలీసు అధికారులు ఎఫ్‌ఐఆర్ ఎలా పొందు పరచాలో వివరించారు. ఫోక్సో తదితర చట్టాల గురించి తెలిపారు. సమాజంలో పోలీసుల పాత్ర కీలకమని, ఒకవైపు నేరాలు జరగకుండా చూస్తూనే మరోవైపు నేరాలకు పాల్పడ్డ వారికి శిక్షపడేలా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సెషన్స్ జడ్జి అన్వర్ బాషాను ఘనంగా సన్మానించారు. ఈ వర్క్ షాపులో అంబేడ్కర్ మిషన్ కార్యదర్శి సంపత్ కుమార్, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి, డీటీసీ డీఎస్పీ జయచంద్రుడు, ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీలు షౌకత్ ఆలీ, లోసారి సుధాకర్, ప్రొద్దుటూరు డీఎస్పీ పూజిత నీలం, రాజంపేట డీఎస్పీ రాజేంద్ర, మహిళా డీఎస్పీ వాసుదేవన్, జిల్లాలోని సీఐలు, ఎస్‌ఐలు తదితరులు పాల్గొన్నారు.