నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం! | today aids day | Sakshi
Sakshi News home page

నిశ్శబ్దాన్ని ఛేదిద్దాం!

Published Wed, Nov 30 2016 11:08 PM | Last Updated on Thu, Mar 28 2019 8:28 PM

today aids day

సందర్భం : నేడు ప్రపంచ ఎయిడ్స్‌ దినం
అనంతపురం మెడికల్‌ : శరీరంలో వ్యాధి నిరోధక శక్తిని క్షీణింపజేసే వైరస్‌ (హ్యూమన్‌ ఇమ్యునో డెఫిషియన్సీ వైరస్‌/హెచ్‌ఐవీ) కారణంగా పలు వ్యాధులకు గురయ్యే పరిస్థితి ఉత్పన్నం కావడాన్ని అక్వైర్డ్‌ ఇమ్యునో డెఫిషియన్సీ సిండ్రోమ్‌ (ఎయిడ్స్‌) అంటారు. 25 నుంచి 44 ఏళ్ల వయసున్న పురుషుల్లో సంభవించే మరణాలకు అతి పెద్ద కారణం ఎయిడ్సెనని అంటున్నారు వైద్యులు. ప్రస్తుతం సమాజాన్ని పట్టిపీడిస్తున్న ఎయిడ్స్‌ బారిన పడకుండా ఉండాలంటే విశృంఖల శృంగారానికి అడ్డుకట్టవేయాల్సిందేనని సూచిస్తున్నారు. హెచ్‌ఐవీ అనేది వైరస్‌.. ఎయిడ్స్‌ అనేది వ్యాధి. నేడు 'ప్రపంచ ఎయిడ్స్‌ దినం' సందర్భంగా 'ఎయిడ్స్‌'పై 'సాక్షి' ప్రత్యేక కథనం.

హెచ్‌ఐవీ ఇలా వస్తుంది
– సురక్షితం కాని లైంగిక సంబంధాలు
– మాదక ద్రవ్యాల వంటి వాటిని తీసుకునేందుకు ఒకే సిరంజి, సూదిని కొందరు కలిసి ఉపయోగించడం.
– రక్త మార్పిడి
– హెచ్‌ఐవీ సోకిన గర్భిణి నుంచి పుట్టబోయే బిడ్డకు రావచ్చు. శిశువు గర్భంలో ఉన్నప్పుడు గానీ, జనన సమయంలో గానీ వ్యాపించే అవకాశం ఉంది. సర్జికల్‌ ఇన్‌స్ట్రుమెంట్స్‌ను శుభ్ర పరచి వాడకపోతే వ్యాపిస్తుంది.

ఎలా వ్యాపించదు
– హెచ్‌ఐవీ బాధితుడికి షేక్‌హ్యాండ్‌ ఇచ్చినా, కలిసి భోజనం చేసినా వ్యాపించదు.
– హెచ్‌ఐవీ బాధితులను ముద్దు పెట్టుకుంటే వ్యాధి వ్యాప్తి చెందుతుందనడానికి ఎలాంటి శాస్త్రీయ ఆధారాలూ లేవు. దోమలు కుట్టడం వల్ల ఈ వ్యాధి వ్యాప్తి చెందదు.

జాగ్రత్తలు తప్పనిసరి
– వివాహేతర సంబంధాలకు దూరంగా ఉండడం
– నమ్మకమైన దాంపత్య జీవితాన్ని పాటిస్తూ జీవిత భాగస్వామితోనే లైంగిక సంబంధం కలిగి ఉండడం
– సరైన పద్ధతిలో కండోమ్‌ వాడడం
 
సీడీ–4 కణాల పాత్రే కీలకం
వ్యాధి నిరోధక వ్యవస్థ ఏ మేరకు నాశనం చెందిందనే విషయాన్ని సీడీ–4 కణాల (టీ హెల్పర్‌ కణాలు–తెల్లరక్త కణాలు) సంఖ్యను బట్టి తెలుస్తుంది. మనిషిలోని వ్యాధి నిరోధక వ్యవస్థలో ఈ కణాల పాత్ర ప్రముఖమైనది. ఆరోగ్యవంతుడిలో సీడీ–4 కణాలు ప్రతి మిల్లీలీటర్‌ రక్తంలో 500 నుంచి 1,500 వరకు ఉంటాయి. సరైన చికిత్స తీసుకోకపోతే సీడీ–4 సంఖ్య గణనీయం తగ్గిపోతుంది. ఫలితంగా హెచ్‌ఐవీ లక్షణాలు కన్పించడం ఆరంభమవుతుంది.
 
వ్యాధి లక్షణాలు కన్పించేందుకు ఐదేళ్లు!
హెచ్‌ఐవీ క్రిములు  శరీరంలోకి ప్రవేశించిన తర్వాత వ్యాధి లక్షణాలు కనిపించడానికి సగటున 5 నుంచి 10 సంవత్సరాలు పడుతుంది. ఇలా కనిపించే లక్షణాల్లో అధికంగా హెచ్‌ఐవీ క్రిముల కారణంగా కాకుండా శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోవడం వల్ల సోకే ఇతర ఇన్‌ఫెక్షన్లకు చెందినవై ఉంటాయి. హెచ్‌ఐవీ క్రిములు శరీరంలోకి చేరిన తర్వాత అవి విభజన చెంది వాటి సంఖ్య పెరిగి, వ్యాధి నిరోధక వ్యవస్థ చిన్నాభిన్నం కావడానికి కొన్ని వారాల నుంచి నెల వరకు పట్టవచ్చు. ఈ సమయంలో పరీక్షలు చేయించుకుంటే హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని ఫలితం రాదు. అయితే బాధితులు మాత్రం ఈ వ్యాధి మరొకరికి వ్యాపింపజేయగలిగే స్థితిలో ఉంటారు.

అప్పుడు పరీక్ష చేస్తేనే 'పాజిటివ్‌'
- హెచ్‌ఐవీ క్రిములతో పోరాడటానికి వ్యాధి నిరోధక వ్యవస్థ యాంటీబాడీస్‌ను తయారు చేయడం ఆరంభిస్తుంది. ఆ సమయంలో పరీక్ష చేస్తే హెచ్‌ఐవీ పాజిటివ్‌ అని వస్తుంది.
- హెచ్‌ఐవీ శరీరంలోకి ప్రవేశించిన తర్వాత తొలి దశలో కనిపించే ఫ్లూ వంటి లక్షణాలు తగ్గిపోయిన తర్వాత బాధితులు కనీసం పదేళ్ల వరకు ఆరోగ్యంగా ఎలాంటి వ్యాధి లక్షణాలు లేకుండా జీవిస్తారు. అయితే ఆ సమయంలో హెచ్‌ఐవీ క్రిములు మాత్రం వ్యాధి నిరోధక వ్యవస్థను నిర్వీర్యం చేస్తూనే ఉంటాయి.
 
బాధితుల కోసం ఏఆర్‌టీ కేంద్రాలు
జిల్లాలో హెచ్‌ఐవీ, ఎయిడ్స్‌ బాధితులకు వైద్య సేవలు అందించడం కోసం అనంతపురం సర్వజనాస్పత్రి, కదిరి ఏరియా ఆస్పత్రి, బత్తలపల్లి ఆర్డీటీ ఆస్పత్రిలో ఏఆర్‌టీ కేంద్రాలు ఉన్నాయి. లింక్‌ ఏఆర్‌టీ కేంద్రాలు హిందూపురం జిల్లా కేంద్ర ఆస్పత్రి, గుంతకల్లు, ఉరవకొండ, గుత్తి, తాడిపత్రి, కళ్యాణదుర్గం, పెనుకొండ, రాయదుర్గం ఆస్పత్రుల్లో ఉన్నాయి. 350, అంతకంటే తక్కువ తెల్లరక్తకణాలు ఉన్న వారు, హెచ్‌ఐవీ ఉన్న గర్భిణులు, టీబీ, హెచ్‌ఐవీ ఉన్న వారు జీవితాంతం మందులు వాడాల్సి ఉంటుంది. హెచ్‌ఐవీ ఇన్‌ఫెక్షన్‌తో బాధపడుతున్న తల్లులకు, పిల్లలకు 28 వారాల పాటు యాంటి రిట్రోవైరల్‌ మందులు  ఇవ్వడం వల్ల ఇన్‌ఫెక్షన్‌ తల్లి నుంచి బిడ్డకు సంక్రమించకుండా నివారించవచ్చు.

అధికారులది ప్రచార ఆర్భాటమే
జనం ఎయిడ్స్‌ భూతం బారిన పడకుండా ఉండేందుకు ఎయిడ్స్‌ నియంత్రణ సంస్థ, వైద్య ఆరోగ్యశాఖ చేపడుతున్న చర్యలు నామమాత్రమే. బాధితుల్లో మనోస్థైర్యం పెంచడంతో పాటు హెచ్‌ఐవీపై అవగాహన కల్పించేందుకు సరైన చర్యలు తీసుకోవడం లేదు. ఏడాది పొడువునా ప్రత్యేక కార్యక్రమాలేవీ చేపట్టకుండా కేవలం డిసెంబర్‌ 1న మాత్రమే 'ఎయిడ్స్‌ నియంత్రణ దినం' సందర్భంగా నానా హంగామా చేయడం రివాజుగా మారుతోంది. ర్యాలీలంటూ ఉన్న నిధులను ఖర్చు చేసి ప్రచార ఆర్భాటానికే పరిమితమవుతున్నారు. ఫలితంగా ఈ వ్యాధి చాపకింద నీరులా పాకుతోంది. హెచ్‌ఐవీ నిర్మూలనకు 'తీవ్రంగా' కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నా బాధితుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతోందన్నది గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఏఆర్‌టీ కేంద్రాల్లో రిజిస్ట్రేషన్‌ అయిన వారిలో ఇప్పటి వరకు సుమారు 4 వేల మంది మృతి చెందినట్లు తెలుస్తోంది. అనధికారికంగా మాత్రం దీని సంఖ్య ఇంకా ఎక్కువగా ఉన్నట్లు సమాచారం.   

ఉన్నత వర్గాల్లోనూ బాధితులు!  
ఎయిడ్స్‌ బారిన పడిన వారిలో ఉన్నత వర్గాలూ ఉండడం కలవరపరుస్తోంది. క్రమం తప్పకుండా మూడు నెలల పాటు మందులు వాడితే ప్రభుత్వం అందించే పింఛన్‌కు అర్హత సాధిస్తారు. ప్రస్తుతం ఏఆర్‌టీ కేంద్రాల్లో 11,061 మంది మందులు తీసుకుంటుంటే పింఛన్లు తీసుకుంటున్న వారు మాత్రం 3,061 మంది ఉన్నారు. మిగిలిన వారిలో కొందరు దరఖాస్తు చేసుకున్నా మరికొందరు మాత్రం తమకు పింఛన్‌ వద్దని చెబుతున్నట్లు తెలిసింది. ఇలాంటి వారిలో చాలా మంది ఉద్యోగులు, వ్యాపార వర్గాలతో పాటు చివరకు వైద్యులు కూడా ఉన్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement