- అభ్యంతరాల్లో రాష్ట్రంలో జిల్లా నంబర్ 1
- నేడు తుది గడువు..
- జిల్లానుంచి 23,043 అభ్యంతరాలు
- కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోసం.. 16041
- సిరిసిల్ల జిల్లా కోరుతూ 2వేలపైగా వినతులు
- ఉద్రిక్తంగా మారుతున్న ఆందోళనలు
- పరిపాలన సౌకర్యాల పనులు ముమ్మరం
అభ్యంతరాలు.. ఏర్పాట్లు
Published Tue, Sep 20 2016 11:12 PM | Last Updated on Wed, Oct 17 2018 3:38 PM
ముకరంపుర : కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం జారీచేసిన ముసాయిదా నోటì ఫికేషన్‌పై అభ్యంతరాలు, సూచనలు, విజ్ఞప్తులలో రాష్ట్రంలోనే జిల్లా నంబర్‌వన్ స్థానంలో ఉంది. అభ్యంతరాలకు ఒక్క రోజే మిగిలి ఉండగా.. రాష్ట్రవ్యాప్తంగా 89,989 అభ్యంతరాలు వచ్చాయి. అందులో జిల్లా నుంచి 23,043 వినతులు వెళ్లాయి. ప్రతిపాదిత జగిత్యాల జిల్లా నుంచి 16,363 అభ్యంతరాలు రాగా.. అందులో కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోరుతూ 16,041 వినతులు రావడం విశేషం. రాష్ట్రవ్యాప్తంగా రెవెన్యూ డివిజన్లు కోరుతూ 20,849 అభ్యంతరాలు, సూచనలు రాగా.. కోరుట్ల నుంచి 16 వేల మందికి పైగా వ్యక్తం చేయడం అక్కడి డిమాండ్‌ను స్పష్టంచేస్తోంది. సిరిసిల్ల జిల్లా కోరుతూ 2 వేలకు పైగా విజ్ఞప్తులు చేశారు. అతితక్కువగా జగిత్యాల జిల్లాకు సంబంధించినవి నమోదయ్యాయి. మరో వైపు సిరిసిల్ల జిల్లా, కోరుట్ల రెవెన్యూ డివిజన్ కోరుతూ ఆందోళనలు ఉధృతరూపం దాల్చాయి. హుస్నాబాద్, కోహెడ మండలాలను సిద్దిపేటలో కలపకుండా కరీంనగర్‌లోనే కొనసాగించాలని నిరసనలు మిన్నంటాయి.
ఏర్పాట్లలో నిమగ్నం...
ఇక దసరా నుంచే కొత్త జిల్లాలు, రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో పాలన ప్రారంభించాలనే ప్రభుత్వ నిర్ణయంతో పరిపాలన సౌకర్యాల కల్పనలో అధికారులు చర్యలు చేపట్టారు. ప్రతిపాదిత పెద్దపల్లి, జగిత్యాలలో కలెక్టరేట్, ఇతర కార్యాలయాల ఏర్పాటు దాదాపు ఖరారైంది. అద్దె భవనాలను ఒప్పందం చేసుకుంటున్నారు. ఫైళ్ల విభజన, స్కానింగ్, అద్దె కార్యాలయాలు, భవనాల మరమ్మతు, సామగ్రి కొనుగోలు, వసతుల కల్పన, ఫర్నిచర్ పంపకాలు తదితర పనులు తుదిదశకు వచ్చాయి. ఆయా ప్రతిపాదిత జిల్లాల్లో జనాభా, అక్షరాస్యత, ఆస్పత్రులు, పాఠశాలలు, కళాశాలలు, పరిశ్రమలు తదితర వాటిపై ముఖ్య ప్రణాళిక అధికారులు సమగ్ర సమాచారాన్ని ప్రభుత్వానికి నివేదించారు. జిల్లా కేంద్రం నుంచి ఉద్యోగుల విభజన లెక్కను కూడా సిద్ధంచేశారు. జిల్లాస్థాయిలో 5601 పోస్టులుండగా.. 4,365 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. వీరిని కరీంనగర్‌కు 2,083, జగిత్యాలకు 1,067, పెద్దపల్లికి 1,215 మందిని కేటాయించారు. పునర్విభజనపై కలెక్టర్ నీతూప్రసాద్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్షిస్తూ పనులను పర్యవేక్షిస్తున్నారు.
Advertisement
Advertisement