సొమ్ము ఒకరిది... పేరు మరొకరిది..!
సొమ్ము ఒకరిది... పేరు మరొకరిది..!
Published Sun, May 14 2017 11:44 PM | Last Updated on Tue, Sep 5 2017 11:09 AM
– పర్యాటకం అభివృద్ధికి ‘అఖండ గోదావరి’ ప్రకటించిన ప్రభుత్వం
– రూ. 100 కోట్లు కేటాయించిన చంద్రబాబు సర్కారు
– ఇప్పటి వరకు మొదటి దఫాగా రూ.32 కోట్లు ఖర్చు
– నగరంలో నదీతీర అభివృద్ధికి నగరపాలక సంస్థ యంత్రాంగం చర్యలు
– రూ.20 కోట్లతో కౌన్సిల్ అజెండాలో చేర్చిన వైనం
– రాష్ట్ర ప్రభుత్వం పనిని నెత్తికెత్తుకుంటున్న అధికారులు
– నగరంలో మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలు అనేకం
– నేడు కౌన్సిల్ సాధారణ సమావేశం
సాక్షి, రాజమహేంద్రవరం: ఉట్టికెక్కలేనమ్మ.. స్వర్గానికి ఎక్కుతాన¯¯¯న్న చందంగా ఉంది రాజమహేంద్రవరం నగరపాలక సంస్థలో పరిపాలన తీరు. నగరం నడిబొడ్డున, ÐÔశివారు ప్రాంతాలలో ఇప్పటికీ అనేక చోట్ల రోడ్డు, డ్రైనేజీలు వంటి కనీస మౌలిక సదుపాయాలు లేని పరిస్థితి. అక్కడ నివసిస్తున్న ప్రజలకు సదుపాయాలు కల్పించాల్సిన పాలకులు, యంత్రాంగం అది మరచి రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న పనులను నెత్తికెత్తుకుంటోంది. ఇందుకోసం ప్రజల డబ్బు రూ.20 కోట్లు ఖర్చు పెట్టడానికి సన్నాహాలు చేస్తోంది. గోదావరి పుష్కరాల అనంతరం సీఎం చంద్రబాబు రాజమహేంద్రవరం నగరాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు అఖండ గోదావరి పేరుతో ఓ ప్రాజెక్టును ప్రకటించారు. ఇందుకు రూ.100 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. ఈ నిధుల ద్వారా కాటన్ బ్యారేజీ నుంచి ఎగువన నగరంలోని కోటిలింగాలఘాట్ వరకు అనువైన గోదావరి తీరం, లంకలను పర్యాటకంగా అభివృద్ధి చేయనున్నారు. కేటయించిన రూ.100 కోట్లను మూడు దఫాలుగా విడుదల చేయాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా మొదటి దఫాగా ఇప్పటికే రూ.18 కోట్లతో కాటన్ బ్యారేజి వద్ద ఉన్న పిచ్చుకలంకను చదును చేశారు. మరో రూ.13 కోట్లను హెవలాక్ బ్రిడ్జి కోసం కేంద్ర ప్రభుత్వానికి చెల్లించారు. రూ.1 కోటితో రోడ్డు కం రైల్ బ్రిడ్జిని సుందరీకరిచారు. ఇలా ఇప్పటి వరకు రూ.32 కోట్లు అఖండ గోదావరి ప్రాజెక్టు కోసం రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు పెట్టింది. అయితే తాజాగా అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా చేయాల్సిన పనులను నగరపాలక సంస్థ చేపట్టేందుకు ఆసక్తి చూపుతోంది. గోదావరి గట్టున సర్వసతీ ఘాట్ నుంచి గౌతమీఘాట్ వరకు నదీ ముఖ ప్రాంతాన్ని పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేయాలని రాజమండ్రి రైజింగ్, ఐడియాస్ ఫర్ రాజమండ్రి డెవలెప్‌మెంట్ ద్వారా ప్రజలు సూచించారని పేర్కొంటూ కౌన్సిల్ ఆమోదానికి యంత్రాంగం అజెండాలో చేర్చింది. దీనికోసం రూ.20 కోట్లు ఖర్చు అవుతుందని, ఆ నిధులు బీపీఎస్, ఎల్‌ఆర్‌ఎస్ పథకాల ద్వారా నగర పాలక సంస్థకు వచ్చిన ఆదాయం నుంచి కేటాయించాలని, పరిపాలన అనుమతి కోసం రాష్ట్ర ప్రభుత్వానికి పంపేందుకు ఆమోదించాలని కోరింది.
నిద్దురపోతున్న పాలక మండలి...
నగరంలో కనీసం మౌలిక సదుపాయాలు లేని ప్రాంతాలు అనేకం ఉన్నా వాటి అభివృద్ధిని పట్టించుకోని పాలక మండలి, యంత్రాంగం ఇలా రాష్ట్ర ప్రభుత్వ పనులను నెత్తికెత్తుకుని రూ. 20 కోట్లు ఖర్చు చేయాలని ప్రతిపాదించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. యంత్రాంగం ఇలా ప్రతిపాదించడం వెంటనే మండలి అజెండాలో చేర్చడంపై నగరవాసులు పాలకమండలిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మా పన్నుల ద్వారా వస్తున్న ఆదాయాన్ని నగరంలో మౌలిక సదుపాయాలు కల్పించకుండా రాష్ట్ర ప్రభుత్వం పనులకు ఖర్చు చేయాలన్న ప్రతిపాదనలపై మండిపడుతున్నారు. యంత్రాంగం ఇలా చేస్తుంటే పాలక మండలి నిద్దురపోతోందా? అంటూ ప్రశ్నిస్తున్నారు. యంత్రాంగం ప్రతిపాదన సోమవారం జరిగే పాలక మండలి సాధారణ సమావేశంలో చర్చకు రానుంది. దీనిపై పాలక మండలి ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోన్న ఉత్కంఠ నగర వాసుల్లో నెలకొంది.
Advertisement
Advertisement