ఆ సేవలు అనితర సాధ్యం
సందర్భం :నేడు ప్రేమమూర్తి ఆరాధనోత్సవం
ప్రేమతత్వమే విశ్వశాంతికి మూలం.. అదే సత్యసాయి బాబా అభిమతం. మానవళిని సన్మార్గం వైపు పయనింపజేసే ఆధ్యాత్మిక బోధనలు... ఆర్తించే ఆపన్నులకు అన్నీ తానై కాపాడుకుంటూ వచ్చిన సత్యసాయి కోట్లాది భక్తుల గుండెల్లో భగవంతుడిగా కొలువై ఉన్నారు. ‘నా జీవితమే నా సందేశం’ అన్న సత్యసాయి బోధ భక్తకోటి మదిలో అను నిత్యం ప్రతిధ్వనిస్తోంది. భౌతికంగా దేహం వీడి పరమపదించినా సర్వాంతర్యామిగా సత్యసాయి ప్రపంచ నలుమూలలా కొలువబడుతున్నారు. ఇందులో భాగంగానే ఈ నెల 24న సత్యసాయి ఆరాధనోత్సవాన్ని భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సత్యసాయి ట్రస్ట్ నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.
- పుట్టపర్తి టౌన్
పూర్వం గొల్లపల్లిగా పిలవబడే పుట్టపర్తిలో ఈశ్వరాంబ, పెద్దవెంకమరాజు దంపతులకు 1926 నవంబర్ 23న సత్యసాయి జన్మించారు. బాల్యంలో సత్యనారాయణ రాజుగా పిలువబడిన ఆయన మెండైన ఆధ్యాత్మిక చింతనతో 1940లో తన 14వ ఏట సత్యసాయి బాబా అవతార ప్రకటన చేశారు. నాటి నుంచి కాషాయ వస్త్రధారిగా దేశదేశాల సంచరిస్తూ ఆధ్యాత్మికత, మానవతా విలువలను ప్రభోదిస్తూ సువిశాల భక్త సామ్రాజాన్ని నిర్మించుకున్నారు. అచిర కాలంలోనే పుట్టపర్తిని అంతర్జాతీయ ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్ది ప్రపంచ పటంలో అనంతపురం జిల్లాకు ప్రత్యేక గుర్తింపు తెచ్చారు.
ఆర్తులను ఆదుకున్న భగవాన్
వరుస కరువులతో గుక్కెడు నీరు గగనమైపోయిన పరిస్థితుల్లో జిల్లాలోని వందలాది గ్రామాల గొంతు తడిపి దప్పిక తీర్చారు. ఉభయగోదావరి, చెన్నై నగరానికి కూడా తాగునీటిని అందించి దాతృత్వాన్ని చాటుకున్నారు. ప్రభుత్వాలు సైతం చేయలేని ఎన్నో గొప్ప కార్యక్రమాలను వందల కోట్ల రూపాయలు వెచ్చించి, అనతి కాలంలోనే పూర్తి చేసిన సత్యసాయి అపరభగీరథుడుగా కీర్తింపబడుతున్నారు. పేదలకు నయాపైసా ఖర్చులేకుండా కార్పొరేట్ వైద్యాన్ని అందించేందుకు పుట్టపర్తి, వైట్‌ఫీల్డ్‌లో సత్యసాయి వైద్య సంస్థలను నెలకొల్పారు.
విలువైన విద్య ఉన్నత సమాజాన్ని నిర్మింస్తుందని ఆకాంక్షించిన సత్యసాయి పుట్టపర్తి కేంద్రంగా సత్యసాయి డీమ్డ్ టు బి యూనివర్శిటీని నెలకొల్పారు. వీటితోపాటు దేశంలోని పలు ప్రాంతాలలో ప్రకృతి విలయాలకు గురై గూడు చెదిరిన వేలాది అపన్నులకు సత్యసాయి తన ట్రస్ట్ ద్వారా గూడు నిర్మించి వారి జీవితాలకు భరోసా ఇచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా 180కి పైగా దేశాలలో సేవా సంస్థలను నెలకొల్పి ఆయా ప్రాంతాలలో సేవా కార్యక్రమాలను చేపట్టారు. మానవాళి శ్రేయస్సును కాంక్షిస్తూ తన ఆధ్యాత్మిక బోధన ద్వారా చైతన్యవంతులను చేస్తూ సన్మార్గదర్శనం చేసిన భగవాన్ తన 85 ఏట 2011 ఏప్రిల్ 24న శివైక్యం పొందారు.అప్పటి నుంచి ప్రతి ఏటా ఏప్రిల్ 24న సత్యసాయి ఆరాధనోత్సవాలను నిర్వహిస్తూ వస్తున్నారు.
నేటి ఆరాధనోత్సవాలు ఇలా..
ఉదయం 8 గంటలకు సాయికుల్వంత్ సభామందిరంలోని సత్యసాయి మహా సమాధి చెంత విద్యార్థుల వేదపఠనం.
ఉదయం 8.10 గంటలకు సత్యసాయి విద్యార్థులు పంచరత్న కీర్తన
ఉదయం 8.40 గంటలకు సత్యసాయి ట్రస్ట్ సభ్యులు నాగానంద, నిమిష్ పాండ్యల ప్రసంగం
అనంతరం సత్యసాయి విద్యార్థుల సంగీత కచేరి
ఉదయం 9.45 గంటలకు మహా మంగళహారతి
ఉదయం 10 గంటలకు హిల్‌వ్యూ స్టేడియంలో మహానారాయణ సేవ
సాయంత్రం సాయికుల్వంత్ సభామందిరంలో అనంత నారాయణ బృందం సాంస్కృతిక ప్రదర్శన