రేపటి నుంచి నాటికల పోటీలు
రేపటి నుంచి నాటికల పోటీలు
Published Sun, Jul 2 2017 10:46 PM | Last Updated on Tue, Sep 5 2017 3:02 PM
కాకినాడ కల్చరల్ : కళాకారులను ప్రోత్సహిస్తూ, నాటక రంగానికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు తమ సంస్థ కృషి చేస్తోందని అల్లూరి సీతారామరాజు నాటక కళాపరిషత్ అధ్యక్ష, కార్యదర్శులు గ్రంధి బాబ్జి, పంపన దయానంద బాబు తెలిపారు. స్థానిక యంగ్‌మెన్స్ క్లబ్ సమావేశపు మందిరంలో ఆదివారం వారు విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర భాషా సంస్కృతిక శాఖ, రాష్ట్ర చలన చిత్ర, టీవీ, నాటక రంగ అభివృద్ధి సంస్థల సౌజన్యంతో ఈ నెల 4 నుంచి 6 వరకూ స్థానిక సూర్యకళామందిర్‌లో ఉభయ తెలుగు రాష్ట్రాల స్థాయి నాటికల పోటీలు నిర్వహించనున్నట్టు తెలిపారు. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు కరప గ్రామంలోని శ్రీ నక్కా సూర్యనారాయణమూర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో ఏర్పాటు చేసిన అల్లూరి సీతారామరాజు విగ్రహాన్ని ఆవిష్కరిస్తామన్నారు. 4న గోవాడ క్రియేషన్స్ వారి ‘రచ్చబండ’ నాటిక, ఎస్‌ఎన్ఎం క్లబ్ వారి ‘గడి’ నాటిక, 5న గ్రామీణ కళాకారుల ఐక్యవేదిక రూపకల్పన చేసిన ‘తేనేటీగలు పగపడతాయి’ నాటిక, మూర్తి కల్చరల్ అసోసియేషన్ వారి ‘అంతిమ తీర్పు’ నాటిక, 6న ఉషోదయ కళానికేతన్ వారి ‘గోవు మాలచ్చిమి’ నాటిక, శ్రీసాయి ఆర్ట్స్ వారి ‘చాలు–ఇకచాలు’ నాటిక, అభినయ ఆర్ట్స్ వారి ‘సరికొత్త మనుషులు’ నాటిక ప్రదర్శించనున్నట్టు వారు తెలిపారు. శ్రీనటరాజ కళామందిర్ కూచిపూడి, ఆంధ్ర నాట్య పాఠశాల నాట్యాచార్య ఆనెం ప్రసాద్ శిష్య బృందంచే ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాల ప్రదర్శన ఉంటుందన్నారు. ప్రముఖ కవి, విమర్శకులు వి.ఎస్.ఆర్.ఎస్.సోమయాజులకు ‘సాహితీ కళాభిజ్ఞ’ పురస్కారం, ప్రభుత్వ ఉద్యోగుల సంఘం సేవకులు బుద్దరాజు సత్యనారాయణకు ‘సేవారత్న’ ఆత్మీయ పురస్కారం అందజేయనున్నట్టు తెలిపారు. సమావేశంలో బాజిబోయిన వెంకటేష్ నాయుడు, భీమశంకర్, తురగా సూర్యారావు, టి.ఎల్.ఆచారి తదితరులు పాల్గొన్నారు.
Advertisement