తణుకు అర్బన్ : తుందుర్రు ఆక్వా ఫ్యాక్టరీ ఏర్పాటులో రెవెన్యూ, పోలీస్ యంత్రాంగాలు అధికార పార్టీకి తొత్తుల్లా వ్యవహరిస్తూ మహిళలపై కూడా అక్రమ కేసులు పెట్టి జైలుపాలు చేస్తున్నారని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి బి.రమాదేవి విమర్శించారు. తుందుర్రు ఘటనలో అరెస్ట్ చేసిన కొంతమంది బాధితులు తణుకు సబ్‌జైలులో ఉన్నారు. వారిని పరామర్శించేందుకు వచ్చిన ఆమె సోమవారం తణుకులో విలేకరులతో మాట్లాడారు. తుందుర్రు, జొన్నలగరువు, కె.బేతపూడి గ్రామా ల్లో ప్రభుత్వం మెగా ఆక్వాఫుడ్ నిర్మాణం కోసం ప్రజలను భయాందోళనకు గురిచేస్తుందన్నారు. చట్టాలకు విరుద్ధంగా ముందుగానే ప్రైవేట్ వ్యక్తులు ఆ ప్రాంతంలో భూములు కొనుగోలు చేసి స్థానిక ప్రజలు ఆమోదించారనే తప్పుడు కాగితాలతో మెగా ఆక్వాఫుడ్ నిర్మాణానికి ఒడిగట్టారన్నారు. ఈ ప్రాంతానికి దిగువన ఉన్న 30 మత్స్యకార గ్రామాలు, వ్యవసాయంపై ఆధారపడిన గ్రామాల ప్రజలు జీవనాధారం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ఆక్వా ఫ్యాక్టరీ కారణంగా నీరు, గాలి వాతావరణ కాలుష్యం ఉంటుందని, గతం లో ఇలాంటి ఫ్యాక్టరీలు ఏర్పాటు చేసిన ప్రాంతాల్లో ఇప్పటికీ పలురకాల వ్యాధులతో బాధపడుతున్న సందర్భాలున్నాయని స్పష్టం చేశారు. ఫ్యాక్టరీ నిర్మాణాన్ని వ్యతిరేకించిన ఐద్వా మహిళ ఆరేటి సత్యవతిపై పోలీ సులు 307 సెక్షన్‌తో కేసు నమోదు చేసి జైలులో పెట్టడం దారుణమన్నారు. ఆంధ్రా, నాగార్జున యూనివర్సిటీల ప్రొఫెసర్లు ఈ నిర్మాణం వల్ల ఏర్పడే కాలుష్యం కారణంగా ప్రజానీకానికి, పంట భూములకు నష్టంవాటిల్లుతుందని తేల్చినా ప్రభుత్వం అధికారికంగా ఎటువంటి కమిషన్‌ను వేయకుండా ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల ఉద్యోగాల ద్వారా ఉపాధి కలుగుతుందని ప్రచారం చేయిస్తుండడం బాధాకరమన్నారు. ఫ్యాక్టరీ నిర్మాణానికి వ్యతిరేకంగా పోరాటం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు జీపులోనే కొందరిని ఫ్యాక్టరీకి అనుకూలంగా పోరాటం చేయిస్తుండడం దిగజారుడు రాజకీయమేనన్నారు. గతంలో భీమవరం, నరసాపురం ఎమ్మెల్యేలు ఈ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తామని మాటిచ్చి ఇప్పుడు మాట్లాడకపోవడం దారుణమన్నారు. 144 సెక్షన్, పోలీస్ పికెటింగ్‌లు ఏర్పాటు చేసి ప్రజల్ని భయభ్రాంతులకు గురిచేస్తున్నారని, తక్షణమే పోలీస్ బలగాలను తొలగించాలని రమాదేవి డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా శ్రామిక మహిళా నాయకురాలు అడ్డగర్ల అజయకుమారి, తణుకు డివిజన్ ఐద్వా కార్యదర్శి కె.నాగరత్నం, టి.సుమ, టి.వెంకటలక్ష్మి పాల్గొన్నారు