అభివృద్ధి దిశగా అడుగులు
Published Fri, Jan 27 2017 12:34 AM | Last Updated on Tue, Sep 5 2017 2:11 AM
గణతంత్ర దినోత్సవ వేడుకల్లో జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్
– ఇండస్ట్రియల్ హబ్‌కు పది వేల ఎకరాల భూకేటాయింపులు
– ఏర్పాటు కానున్న మరో మూడు సిమెంట్ పరిశ్రమలు
– వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధే లక్ష్యం
– ప్రపంచంలోనే గని, శకునాల అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు
– వరి, పెసలు, మినుము సాగులో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానం
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు):
కర్నూలు జిల్లా అభివృద్ధి దిశగా అడుగులు వేస్తోందని జిల్లా కలెక్టర్ సీహెచ్ విజయమోహన్ అన్నారు. గురువారం 68వ గణతంత్ర దినోత్సవ వేడుకలను పురస్కరించుకొని పరేడ్ గ్రౌండ్‌లో జాతీయ జెండాను ఎగుర వేసి సాయుధ దళాల గౌరవ వందనాన్ని స్వీకరించారు. అనంతరం గణతంత్ర దినోత్సవ సందేశాన్ని జిల్లా ప్రజలకు వివరించారు. ఓర్వకల్లు మండలంలో రూ.25వేల కోట్ల పెట్టుబడి అంచనాలతో 10,922 ఎకరాల్లో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కొలిమిగుండ్ల మండలంలో రూ.1200 కోట్లతో రామ్‌కో, రూ.2వేల కోట్లతో ప్రిజమ్, రూ.1400 కోట్లతో ఆల్ట్రాటెక్ సిమెంట్ పరిశ్రమలు ఏర్పాటు కానున్నాయని, వీటి ద్వారా 5వేల మందికి ఉపాధి లభిస్తుందన్నారు. గని, శకునాలలో వెయ్యి మెగావాట్ల సామర్థ్యంతో ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్రాజెక్టు ఏర్పాటు కాబోతోందని, ఇది జిల్లాకే గర్వకారణమన్నారు. వరి, పెసలు, మినుము సాగులో కర్నూలు జిల్లా రాష్ట్రంలోనే ప్రథమ స్థానంలో నిలిచి ఆదర్శంగా నిలించిందన్నారు. రాష్ట్రంలోనే ప్రప్రథమంగా ఆదోని, నందికొట్కూరు ప్రాంతాల్లో ముస్లిం మైనార్టీ విద్యార్థులకు జూనియర్, పాలిటెక్నిక్ కళాశాలను ప్రారంభించామన్నారు. ఆయన మాటల్లో మరికొన్ని అభివృద్ధి పనులు..
– నీరు-చెట్టు కార్యక్రమంలో రూ.148.69 కోట్లతో 634 చెరువుల్లో 1.50 కోట్ల క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని తొలగించాం.
– ఈ ఏడాది ఏపీఎస్‌ఐడీసీ ద్వారా రూ.208.19 కోట్లతో 12 ఎత్తిపోతల పథకాలు ప్రారంభించి 26,811 ఎకరాలకు సాగునీరు అందించాం.
– గురురాఘవేంద్ర ప్రాజెక్టు కింద పులికనుమ, పులకుర్తి ప్రాజెక్టులను మార్చిలోపు పూర్తి చేసి 30 వేల ఎకరాలకు సాగునీటిని అందిస్తాం.
– జిల్లాలో 22 శాతం వర్షపాతం నమోదైనప్పటికీ నీటిని సక్రమంగా వినియోగించుకొని కరువును పారద్రోలాం. వరి, పెసలు, మినుము ఉత్పతిలో రాష్ట్రంలో కర్నూలు జిల్లా ప్రథమ స్థానంలో నిలిచింది.
– ఈ యేడాది 1.50 లక్షల క్వింటాళ్ల విత్తనాలను 51.97 కోట్ల సబ్సిడీతో అందించాం.
– వ్యవసాయ యాంత్రీకరణ పథకం కింద 50 శాతం రాయితీపై రూ.16 కోట్లతో 4వేల ఆధునిక వ్యవసాయ పరికరాలను అన్నదాతలకు అందించాం. పశుసంసర్ధక శాఖ ద్వారా తడకనపల్లెలో రూ.2కోట్ల ఉపాధి నిధులతో పశువుల వసతిగృహాన్ని రాష్ట్రంలోనే ప్రథమంగా నిర్మించాం.
– ఓడీఎఫ్ కింద 76 గ్రామ పంచాయతీలను బహిరంగ మల విసర్జనరహిత గ్రామాలుగా తీర్చిదిద్దాం.
– గ్రామాల్లో రూ.76 కోట్లతో 365 కిలోమీటర్ల సీసీ రోడ్ల నిర్మాణాలను పూర్తి చేశాం.
– నిరాశ, నిస్పృహ, నిరాదరణకు గురైన మహిళలకు ఆర్థిక చేయూతనిచ్చేందుకు ఆలూరు, ఆస్పరి మండల్లాల్లో జీన్స్ క్లస్టర్లు, కర్నూలు మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలో జూట్ బ్యాగు క్లస్టర్లను ప్రారంభించి వారికి వెన్నుదన్నుగా నిలిచాం.
– గ్రామీణ నీటి సరఫరా శాఖ ద్వారా సింగిల్ విండో స్కీం కింద రూ.74.43 లక్షలతో 217 గ్రామాల్లో రక్షిత తాగునీటి పథకాలను మెరుగుపరిచాం.
– ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద 14,800 గృహాలను మంజూరు చేశాం.
– నగరపాలక సంస్థ పరిధిలో రూ.280.87 కోట్లతో 765 పనులు మంజూరు చేశాం.
– పెద్దాసుపత్రిలో గుండె శస్త్ర చికిత్సలకు సంబంధించి రూ.7కోట్లతో కార్డియాక్ సర్జరీ విభాగాన్ని ప్రారంభించి 30 బైపాస్ శస్త్ర చికిత్సలను నిర్వహించాం.
– రెవెన్యూశాఖ ద్వారా మీ ఇంటికి మీ భూమి కార్యక్రమాన్ని చేపట్టి భూ తగాదాలు, క్రయ విక్రయాల్లో వివాదాలు, 513 అంగన్‌వాడీ సొంత భవనాల నిర్మాణానికి రూ.36కోట్లు మంజూరు చేశాం.
– 2014–15 సంవత్సరంలో రూ.93 కోట్లతో 230 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డును పూర్తి చేశాం.
– ఈ ఆర్థిక సంవత్సరం 460 కిలోమీటర్ల సిమెంట్ రోడ్డు లక్ష్యంలో ఇప్పటి వరకు రూ.162 కోట్లతో 400 కిలోమీటర్ల రోడ్డును పూర్తి చేశాం. కార్యక్రమంలో జిల్లా జడ్జి అనుపమ చక్రవర్తి, ఎంపీలు బుట్టా రేణుక, టీజీ వెంకటేష్, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి, డీఐజీ రమణకుమార్, జిల్లా ఎస్పీ ఆకె రవికృష్ణ, జాయింట్ కలెక్టర్ సి.హరికిరణ్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement