అంతా విషతుల్యం | Toxicity of fruits | Sakshi
Sakshi News home page

అంతా విషతుల్యం

Published Tue, Mar 7 2017 10:56 PM | Last Updated on Tue, Sep 5 2017 5:27 AM

అంతా విషతుల్యం

అంతా విషతుల్యం

► రసాయనాలతో మాగబెడుతున్న పండ్లు
► పైన ధగధగ.. లోన విషపూరితం
►  ఉమ్మడి జిల్లాలో రూ.50కోట్ల వ్యాపారం
►  ప్రజారోగ్యంపై పట్టింపేది?


ఆదిలాబాద్‌ : ‘వేసవి తాపం నుంచి చక్కని ఉపశమనానికి పండ్లు తినండి.. ఈ సీజనల్‌ ఫ్రూట్స్‌ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. వైద్యుల నుంచి సామాన్యుల వరకు ఇదే చెబుతారు. కానీ అన్ని పండ్లూ ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం మరిచేపోతున్నారు. సహజంగా పండే పండ్లు ఆరోగ్యానికి హాని కలిగించవు. కానీ ప్రమాదకర రసాయనాలతో మాగేసిన పండ్లు ఆరోగ్యానికి ఎంతో చేటు తెస్తాయి.

ఉమ్మడి జిల్లాలో రూ.50 కోట్ల వ్యాపారం..
వేసవి వచ్చిందంటే పండ్ల వ్యాపారం జోరందుకుంటోంది. పండ్లు శరీరారోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయో.. కృత్రిమంగా పండించిన పండ్లను తింటే అంతే చేటు తెస్తాయి. అయితే వ్యాపారుల కక్కుర్తి వ్యవహారంతో స్వచ్ఛమైన పండ్లు మాత్రం అందుబాటులో లేకుండా పోతున్నాయి. వేసవిలో పండ్ల రసాలు తాగడం సహజం. కాయలు పక్వానికి రాకముందే తెంపి కాల్షియం, కార్బొరేట్‌ వంటి రసాయనాలతో మాగబెడుతున్నారు. మామిడి, అరటి, ద్రాక్ష, బొప్పాయి, సపోటా తదితర పండ్లపై ఎక్కువగా ఈ ప్రయోగాలు కొనసాగుతున్నాయి.

కోతకు రాకముందే..
ఎక్కువగా ఈ సీజన్లో లభించేది మామిడి. మామడిని కొంతమంది వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి కృత్రిమంగా పండించి వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కాయలు పూర్తిగా దిగుబడి దశకు రాక ముందే రసాయనాలతో మగ్గించి మార్కెట్‌లోకి తీసుకువస్తున్నారు. తర్భూజ, ఖర్భూజ, దోసకాయ తదితర పండ్లు త్వరగా పెరిగేందుకు ఇంజక్షన్ల ద్వారా రసాయనాలను ఇస్తున్నారు.

గ్యాస్‌ వెల్డింగ్‌కు వినియోగించే కాల్షియం కార్బొరైట్‌ను కొనుగోలు చేసి కుప్పగా పోసిన కాయల్లో నాలుగు వైపులా వీటిని అమరుస్తారు. 50కిలోల కాయలకు 30 వరకు పొట్లాలను పెడతారు. ఈ గుళికలు పౌడర్‌గా మారి వేడి పుట్టిస్తాయి. ఇలా కాయలు తొందరగా పక్వానికి వచ్చి పచ్చగా మెరుస్తాయి. ఖర్భూజ, దోసకాయలు ఎదగడానికి వివిధ రకాల ఇంజక్షన్లు ఇస్తున్నారు. దీంతో విత్తనం నాటిన రెండుమూడు నెలల్లో దిగుబడి రావాలి్సన కాయలు నెల పదిహేను రోజుల్లోనే ఎదిగి కోతకు వస్తున్నాయి.

ఆరోగ్యానికి హానికరం..
రసాయనాలతో పండించిన పండ్లను తినడం ద్వారా నరాలు బలహీనపడటంతో పాటు తలనొప్పి, మగతగా ఉండడం, ఫిట్స్‌ రావడం, మతిమరుపు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. అలాగే కాలే యం, మూత్రపిండాలు, జీర్ణాశయంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు. ఇలా పండ్ల వ్యాపారం ఉమ్మడి జిల్లాలో ఏటా రూ.50కోట్ల పైనే జరుగుతోంది. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్‌ పట్టణాల్లో ఎక్కువగా ఈ పండ్ల గోదాములున్నాయి.

జిల్లాలో భానుడి ప్రతాపం..
జిల్లాలో ఏటా వివిధ రకాల కాయలు, పండ్లు పూర్తిస్థాయిలో దిగుబడి రాకముందే ఎదిగే దశలోనే తెంపి రసాయనాలతో మార్కెట్‌ తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఏటా మార్చి నెలలోనే ఇది మొదలవుతోంది. జిల్లాలో భానుడు అగ్నిగుండంగా మండిపోతున్నాడు. కొద్ది రోజులుగా వేసవి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇప్పటినుంచే భయపడిపోతున్నారు. ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు జిల్లా వాసులు చల్లచల్లని పానీయాలతో పాటు తాజా పండ్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు.

వేసవి సీజన్ లో దొరికే అన్ని రకాల ఫలాలు ప్రస్తుతం మార్కెట్‌లో లభ్యమవుతున్నాయి. కర్భుజా, ద్రాక్ష, సంత్ర, బొప్పాయి, దోసకాయ, మామిడి పండ్ల రసాలు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్‌ చౌక్, వినాయక్‌ చౌక్, ఎన్టీఆర్‌ చౌక్‌ తదితర ప్రధాన కూడళ్లలో తోపుడు బండ్లపై అమ్మకాలు జరుపుతుంటారు. నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్‌ వంటి పట్టణ కేంద్రాల్లోనూ ఈ అమ్మకాలు జోరుగా సాగుతాయి.

హైకోర్టు నిబంధనలు గాలికి..
పండ్లను సహజంగానే మగ్గబెట్టి విక్రయించాలని, అలా కాకుండా వివిధ రకాల రసాయనాలు, కార్బొరైట్‌ను వినియోగించి పండ్లను మాగబెడితే వారిపై చట్ట ప్రకారం కటిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు 2016లో రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. అయినా వ్యాపారులు మాత్రం మారడం లేదు. ప్రస్తుత వేసవి సీజన్ లో పండ్లను ఇలాగే మాగేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారులు ఎప్పుడో ఒకప్పుడు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నా.. కఠినంగా వ్యవహరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రాణ నష్టం జరగకముందే పట్టించుకుని పండ్ల గోదాములు, దుకాణాలపై పర్యవేక్షణ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement