Toxicity
-
ట్విటర్‌కు ఆస్ట్రేలియా డెడ్‌లైన్: ఉద్యోగులను తొలగించిన పాపం ఊరికే పోతుందా?
ఆన్లైన్ దుర్వినియోగాన్ని పరిష్కరించడంలో విఫలమైనందుకు ట్విటర్‌కు జరిమానా విధిస్తామని ఆస్ట్రేలియా ఇంటర్నెట్ సేఫ్టీ సంస్థ హెచ్చరించింది. ఎలాన్ మస్క్ ఆధీనంలోకి వెళ్లిన తర్వాత ట్విటర్లో విషపూరిత, విద్వేష కంటెంట్ పెరిగిపోయిందని ఆరోపించింది. ఆన్లైన్ ద్వేషపూరిత ప్రసంగాలపై ఆస్ట్రేలియాలో నమోదవుతున్న ఫిర్యాదులలో మూడింటిలో ఒకటి ట్విటర్‌పై ఉంటోందని ఆ దేశ ఈ-సేఫ్టీ కమిషనర్ జూలీ ఇన్మాన్ గ్రాంట్ అన్నారు. ఆమె ట్విటర్ మాజీ ఉద్యోగి కావడం గమనార్హం. వైఫల్యాన్ని సవరించుకోవడానికి ట్విటర్‌కు 28 రోజుల సమయం ఇస్తున్నామని, ఆ గడువు దాటితే రోజుకు 7 లక్షల ఆస్ట్రేలియా డాలర్లు (దాదాపు రూ.3.9 కోట్లు) జరిమానా చెల్లించాల్సి ఉంటుందని ఇన్మాన్ గ్రాంట్ తెలిపారు. ఉద్యోగుల తొలగింపుతో చిక్కులు మస్క్ 2022 అక్టోబర్‌లో ట్విటర్‌ను కొనుగోలు చేసినప్పటి నుంచి సంస్థలో 80 శాతం ఉద్యోగులను తొలగించారు. వీరిలో కంటెంట్ దుర్వినియోగాన్ని అరికట్టడానికి పనిచేసే కంటెంట్ మోడరేటర్లు కూడా చాలా మంది ఉన్నారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లను నియంత్రించే గ్లోబల్ డ్రైవ్‌కు ఆస్ట్రేలియా నాయకత్వం వహిస్తోంది. ఇన్మాన్ గ్రాంట్ ట్విటర్ ట్విటర్ తప్పులను ఎత్తిచూపడం ఇదే మొదటిసారి కాదు. గత ఏడాది నవంబర్లోనే ఆమె మస్క్‌కి లేఖ రాశారు. సంస్థలో మితిమీరిన ఉద్యోగుల తొలగింపులు ఆస్ట్రేలియన్ చట్టాలను అందుకోలేకపోవడానికి దారి తీస్తాయని ఆందోళన వ్యక్తం చేశారు. ట్విటర్లో జాత్యాహంకార వ్యాఖ్యలకు తాను గురైనట్లు ఆస్ట్రేలియాకు చెందిన ప్రముఖ జర్నలిస్ట్ స్టాన్ గ్రాంట్ పేర్కొన్నారు. దీనిపై గత మే నెలలో ట్విటర్ యాజమాన్యానికి తాను ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఇదీ చదవండి: Olx Layoffs: ఓఎల్ఎక్స్లో ఉద్యోగాల కోత.. పలు దేశాల్లో మూసివేత -
Egypt COP27: పర్యావరణ ప్రతినలు... లక్ష్యానికి ఆమడ దూరం
భూమి నానాటికీ వేడుక్కుతోంది. ఒకవైపు తీవ్ర కరువు. మరోవైపు పలు దేశాల్లో కనీవినీ ఎరగని వరదలు సృష్టిస్తున్న పెను బీభత్సం. ఇలాంటి ఉత్పతాలన్నింటికీ కారణం పర్యావరణ మార్పులు. ఇది రానురానూ తీవ్ర రూపు దాలుస్తూ మానవాళిని వణికిస్తోంది. ఎవరేం చెప్పినా, దేశాలు ఎన్ని చేసినా సమస్య నానాటికీ ముదురుతోందే తప్ప పరిస్థితిలో మెరుగుదల మాత్రం కన్పించడం లేదు. ప్రపంచవ్యాప్తంగా వాతావరణం నానాటికీ విషతుల్యంగా మారుతోంది. రోజులు గడుస్తున్న కొద్దీ పర్యావరణానికి ముప్పు పెరుగుతోందే తప్ప తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలో పర్యావరణ మార్పులపై సదస్సు (కాప్–27) ఆదివారం ఈజిప్టులో మొదలవుతోంది. 12 రోజుల పాటు జరిగే ఈ సదస్సులోనైనా పర్యావరణాన్ని కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు తీసుకునే దిశగా గట్టి ముందడుగు పడుతుందేమో చూడాలి... కాగితాల్లోనే ఒప్పందాలు గతేడాది స్కాట్లండ్‌లోని గ్లాస్గోలో జరిగిన కాప్–26లో దేశాలన్నీ మేధోమథనం చేసి గట్టి తీర్మానాలతో పర్యావరణ ఒప్పందమైతే ఆమోదించాయి. దీన్నో పెద్ద సానుకూల చర్యగా ప్రపంచమంతా కొనియాడింది. ఎందుకంటే శిలాజ ఇంధనాల వల్ల పర్యావరణానికి కలుగుతున్న తీవ్ర హానిని అంతర్జాతీయంగా తొలిసారిగా అధికారికంగా గుర్తించింది గ్లాస్గో సదస్సులోనే. వాటి వాడకాన్ని వీలైనంతగా తగ్గిస్తూ క్రమంగా పూర్తిగా నిలిపేయాలని దేశాలన్నింటికీ సదస్సు పిలుపునిచ్చింది. కానీ ఏడాది గడిచినా ప్రపంచవ్యాప్తంగా శిలాజ ఇంధనాల వాడకం నానాటికీ పెరుగుతోందే తప్ప తగ్గకపోవడం శోచనీయం. పులిమీద పుట్రలా యుద్ధం... రష్యా–ఉక్రెయిన్ యుద్ధం దెబ్బకు పరిస్థితి మరింతగా దిగజారింది. రష్యా నుంచి సహజవాయు సరఫరాలు భారీగా తగ్గిపోవడంతో యూరప్ సహా పలు దేశాలు మరో దారి లేక శిలాజ ఇంధనాల వాడకాన్ని పెంచేశాయి. అందులోనూ అత్యంత కాలుష్యకారకమైన బొగ్గు వాడకం విపరీతంగా పెరిగిపోతున్న వైనం కలవరపెడుతోంది. 2022లో బొగ్గు వాడకం 2013లో నమోదైన ఆల్‌టైం రికార్డును చేరడం ఖాయమని అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) జోస్యం చెబుతోంది. ఒక్క యూరోపియన్ యూనియన్లోనే బొగ్గు డిమాండ్ కనీసం 6.5 శాతం పెరుగుతుందని అంచనా. మొత్తమ్మీద 2030 కల్లా అంతర్జాతీయ బొగ్గు వినియోగం 2021తోపోలిస్తే 8.7 శాతానికి మించి తగ్గకపోవచ్చంటున్నారు. ఈ లెక్కన 2050 నాటికి శిలాజ ఇంధనాల వాడకాన్ని పూర్తిగా నిలిపేయాలన్న లక్ష్యం చేరడం అసాధ్యమే. అది జరగాలంటే 2030 నాటికి బొగ్గు వాడకం ఏకంగా 35 శాతం తగ్గాల్సి ఉంటుంది! గతేడాది సదస్సులో వర్ధమాన దేశాలన్నింటినీ బొగ్గు తదితర శిలాజ ఇంధనాలకు గుడ్‌బై చెప్పాలని కోరిన సంపన్న దేశాలే ఇప్పుడు ఆ దేశాలను మించి వాటిని వాడుతుండటం విషాదం. ఈ ధోరణికి వెంటనే అడ్డుకట్ట పడకుంటే 2100 నాటికి భూగోళం ఏకంగా మరో 2.6 డిగ్రీల మేరకు వేడెక్కుతుందని పర్యావరణ శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. భూతాపోన్నతిని 1.5 డిగ్రీలకు పరిమితం చేయాలన్న గ్లాస్గో ఒప్పందం అమలుకు సదస్సు ఏ చర్యలు తీసుకుంటుందన్నది ఆసక్తికరం. భద్రతా వలయంలో రిసార్టు పర్యావరణ కార్యకర్తల నిరసనల భయాల నడుమ సీఓపీ27కు వేదిక కానున్న సినాయ్ ద్వీపకల్పంలోని షర్మెల్ షేక్‌లోని రిసార్టు వద్ద ఈజిప్టు ప్రభుత్వం అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేసింది. కోరల్ రీఫ్‌లు, అత్యంత అందమైన సముద్ర తీరాలకు ఈ రిసార్టు నిలయం. స్థానికంగా టూరిజంలో పనిచేసే వాళ్లలో చాలామందిని తాత్కాలికంగా ఇళ్లకు పంపారు. మిగతా వారికి ప్రత్యేకమైన గుర్తింపు కార్డులిచ్చారు. సెలవులు గడిపేందుకు వస్తున్న టూరిస్టులను కూడా అడ్డుకుంటున్నారు. గతేడాది గ్లాస్గోలో సదస్సు జరిగిన వీధిలోకి ఏకంగా లక్షలమంది దూసుకొచ్చి నిరసనలకు దిగారు. కాప్ సదస్సు 1995 నుంచి ఏటా జరుగుతోంది. ఆర్థిక, సాంకేతిక సాయాలకు పట్టుబట్టనున్న భారత్ వాతావరణ మార్పులు, తద్వారా వస్తున్న విపత్తులను అరికట్టేందుకు అవసరమైన ఆర్థిక, సాంకేతిక సాయాన్ని సంపన్న దేశాలు భారీగా పెంచాలని సదస్సులో భారత్ డిమాండ్ చేసే అవకాశం కన్పిస్తోంది. మన ప్రతినిధి బృందానికి కేంద్ర పర్యావరణ మంత్రి భూపేందర్ యాదవ్ నేతృత్వం వహిస్తారు. మొత్తం 198 దేశాలు సదస్సులో పాల్గొంటున్నాయి. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్, బ్రిటన్ ప్రధాని రిషి సునాక్‌తో పాటు 100 మందికి పైగా దేశాధినేతలు హాజరవనున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొనడంపై స్పష్టత లేదు. – సాక్షి, నేషనల్ డెస్క్ -
నాచు.. భయపెడుతోంది!
కరీబియన్ దీవులు.. ప్రకృతి అందాలకు మారుపేరు. భువిలో స్వర్గంగా పేరుగాంచాయి. అలాంటి కరీబియన్ తీర ప్రాంతాలను ఇప్పుడు సముద్రపు నాచు తీవ్రంగా కలవరపెడుతోంది. సర్గాసమ్ అనే రకం నాచు విపరీతంగా పెరిగిపోతోంది. రోజురోజుకూ విస్తరిస్తోంది. ఈ ఏడాది జూన్ నాటికి కరీబియన్ సముద్రం, గల్ఫ్ ఆఫ్ మెక్సికో, సెంట్రల్ వెస్ట్, ఈస్ట్ అట్లాంటిక్‌లో 24.2 మిలియన్ టన్నుల నాచు పేరుకుపోయినట్లు అంచనా. ప్రమాదకరమైన ఈ నాచు జీవజాలానికి, పర్యావరణానికి ముప్పుగా పరిణమిస్తోంది. తీర ప్రాంతాల నుంచి విషపూరిత వాయువులు వెలువడుతున్నాయి. అంతేకాదు పర్యాటకం సైతం దెబ్బతింటోంది. పర్యాటకుల సంఖ్య నానాటికీ పడిపోతోంది. ఫలితంగా ఉపాధి కోల్పోతున్నామని స్థానికులు గగ్గోలు పెడుతున్నారు. ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం కరీబియన్ తీరంలోని నాచును పక్కపక్కనే పేరిస్తే అది ఫ్లోరిడా గల్ఫ్ తీరంలోని టాంపా బే వైశాల్యం కంటే ఆరు రెట్లు అధికంగా ఉంటుందని యూనివర్సిటీ ఆఫ్ సౌత్ ఫ్లోరిడాకు చెందిన పరిశోధకుడు చువాన్మిన్ హూ చెప్పారు. ఒకప్పుడు జనంతో కళకళలాడిన బీచ్‌లు నాచు కారణంగా వెలవెలబోతున్నాయని, అక్కడ వ్యాపారాలు దారుణంగా పడిపోతున్నాయని యూఎస్ వర్జిన్ ఐలాండ్స్ గవర్నర్ ఆల్బర్ట్ బ్రియాన్ చెప్పారు. తమ ఆర్థిక వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతోందని వాపోయారు. కరీబియన్ బీచ్‌లను నాచురహితంగా మార్చాలని, ఇందుకు సమయం పడుతుందన్నారు. మెక్సికోలో 18 బీచ్‌ల్లో నాచు తిష్ట సముద్ర ఉపరితలంపై నాచు దట్టంగా పేరుకుపోతుండడంతో నౌకలు, పడవల రాకపోకలకు ఇబ్బందికరంగా మారింది. చేపల వేట సైతం ఆగిపోతోంది. సర్గాసమ్ నాచు వల్ల అట్లాంటిక్ సముద్ర తీర ప్రాంతాల్లో ముక్కుపుటలు అదిరిపోయే దుర్గంధం వెలువడుతుండడంతో అటువైపు వెళ్లేందుకు సాధారణ జనంతోపాటు మత్స్యకారులు కూడా జంకుతున్నారు. ఈ వాసనను పీలిస్తే తల తిరగడం, ఊపిరి పీల్చుకోవడంలో ఇబ్బందులు, గుండె కొట్టుకోవడంలో హెచ్చతగ్గులు వంటి లక్షణాలు ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. నాచు నిర్జీవమైపోయిన తర్వాత సముద్రంలో అడుగు భాగానికి చేరుకుంటుంది. దీనివల్ల విలువైన పగడపు దిబ్బలు కనుమరుగయ్యే ప్రమాదం పొంచి ఉంది. మెక్సికోలో 18 బీచ్‌లు నాచుతో నిండిపోయినట్లు గుర్తించారు. గత నెలలో యూఎస్ వర్జిన్ ఐలాండ్స్‌లో అత్యవసర పరిస్థితి ప్రకటించారంటే నాచు ముప్పు ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. సర్గాసమ్ నాచు ఇంతలా వ్యాప్తి చెందడానికి కారణం ఏమిటంటే.. బలంగా వీస్తున్న ఈదురు గాలులు, సముద్రపు అలల ఉధృతి. దక్షిణ అట్లాంటిక్ వాతావరణం నాచు పెరుగుదలకు అనుకూలంగా ఉందని అంటున్నారు. నాచు వల్ల కేవలం నష్టాలే కాదు, లాభాలూ ఉన్నాయి. పీతలు, డాల్ఫిన్లు, సీల్స్, చేపలు వంటి సముద్ర జీవులకు ఇది ఆహారంగా ఉపయోగడుతోంది. సంక్షోభంలోనూ అవకాశం అంటే ఇదే. నాచును సేకరించి, ఎరువు తయారు చేయొచ్చు. కొన్ని దేశాల్లో నాచును సలాడ్ల తయారీకి ఉపగియోస్తారు. – నేషనల్ డెస్క్, సాక్షి -
ఇళ్లు తగులబడకుండా ‘గులాబీ పౌడర్’
ఆస్ట్రేలియా తూర్పు కోస్తా ప్రాంతంలో మంగళవారం ప్రారంభమైన కార్చిచ్చు సిడ్నీ నగరం సబర్బన్ ప్రాంతాలను పాకి ప్రజలను వణికిస్తోంది. వెయ్యి కిలోమీటర్ల పరిధిలోని దాదాపు 1,50,000 హెక్టార్లలో అడవులను ఆవహించిన కార్చిచ్చు బుధవారం కూడా కొనసాగుతోంది. అటవి శివారు ప్రాంతాల్లోని నివాస గృహాలు అంటుకోకుండా అడ్డుకోగల అమ్మోనియంతో తయారు చేసిన ఓ రకమైన గులాబీ ఎరువుల పొడిని హెలికాప్టర్ల ద్వారా ఇంటి కప్పులపైనా, పక్కనున్న పొదలపైన, కార్లపైన చల్లుతున్నారు. ఈ పౌడర్‌లో అమ్మోనియంతోపాటు డైఅమ్మోనియం సల్ఫేట్, అమ్మోనియం ఫాస్ఫేట్ ఉంటుంది. ఇది మంటలు వ్యాపించకుండా ఉంటుందని, అయితే ఘాటైన వాసన కలిగిన ఈ పౌడర్ వల్ల శ్వాస ఇబ్బందులు, చర్మంపై దద్దులు వచ్చే ప్రమాదం ఉందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పౌడరుకు దూరంగా ఉండే వాళ్లకన్నా పౌడరు చల్లే వారు, వాటిని మోసుకొచ్చే వారికే ఈ ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరించారు. దీంతో ఆస్ట్రేలియా ఆరోగ్య శాఖ అధికారులు అప్రమత్తులై తగిన సూచనలు చేశారు. కార్లపైన, వాహనాలపైన పడిన గులాబీ పౌడరును నీటితో డైల్యూట్ చేసి, డిటర్జెంట్, బ్రష్‌లు ఉపయోగించి శుభ్రం చేసుకోవాలని, ఆ సందర్భంగా చేతులకు తప్పనిసరిగా గ్లౌజులు ధరించాలని, కాళ్లకు జారిపోని బూట్లను ధరించాలని, ఈ నిబంధనలను ఉల్లంఘిస్తే ఒక్కొక్కరికి 220 డాలర్ల జరిమానా విధిస్తామని వారు హెచ్చరించారు. మంటల నుంచి నివాస ప్రాంతాలను రక్షించడం కోసం మంగళవారం అమ్మోనియంతో కూడి గులాబీ పౌడర్‌ను చల్లామని, ఇదే విష పదార్థం కాదని రూరల్ ఫైర్ సర్వీస్ అధికార ప్రతినిధి ఇన్స్పెక్టర్ బెన్ షెపర్డ్ మీడియాకు తెలిపారు. చిన్న చిన్న ఇబ్బందులు తప్పక పోవచ్చని అన్నారు. ఈ పౌడరు బారిన పడిన వారు నీళ్లతో ఒళ్లంతా శుభ్రం చేసుకోవాలని, అవసరమైతే వైద్యులను సంప్రతించాలని ఆయన సూచించారు. ఇదిలా ఉండగా, దీని వల్ల క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉందని అమెరికా పర్యావరణ కార్యకర్త ఎరిన్ బ్రొకోవిచ్ హెచ్చరిస్తున్నారు. -
అంతా విషతుల్యం
► రసాయనాలతో మాగబెడుతున్న పండ్లు ► పైన ధగధగ.. లోన విషపూరితం ► ఉమ్మడి జిల్లాలో రూ.50కోట్ల వ్యాపారం ► ప్రజారోగ్యంపై పట్టింపేది? ఆదిలాబాద్ : ‘వేసవి తాపం నుంచి చక్కని ఉపశమనానికి పండ్లు తినండి.. ఈ సీజనల్ ఫ్రూట్స్ ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి.. వైద్యుల నుంచి సామాన్యుల వరకు ఇదే చెబుతారు. కానీ అన్ని పండ్లూ ఆరోగ్యానికి మంచిది కాదనే విషయం మరిచేపోతున్నారు. సహజంగా పండే పండ్లు ఆరోగ్యానికి హాని కలిగించవు. కానీ ప్రమాదకర రసాయనాలతో మాగేసిన పండ్లు ఆరోగ్యానికి ఎంతో చేటు తెస్తాయి. ఉమ్మడి జిల్లాలో రూ.50 కోట్ల వ్యాపారం.. వేసవి వచ్చిందంటే పండ్ల వ్యాపారం జోరందుకుంటోంది. పండ్లు శరీరారోగ్యానికి ఎంతగానో ఉపయోగపడతాయో.. కృత్రిమంగా పండించిన పండ్లను తింటే అంతే చేటు తెస్తాయి. అయితే వ్యాపారుల కక్కుర్తి వ్యవహారంతో స్వచ్ఛమైన పండ్లు మాత్రం అందుబాటులో లేకుండా పోతున్నాయి. వేసవిలో పండ్ల రసాలు తాగడం సహజం. కాయలు పక్వానికి రాకముందే తెంపి కాల్షియం, కార్బొరేట్ వంటి రసాయనాలతో మాగబెడుతున్నారు. మామిడి, అరటి, ద్రాక్ష, బొప్పాయి, సపోటా తదితర పండ్లపై ఎక్కువగా ఈ ప్రయోగాలు కొనసాగుతున్నాయి. కోతకు రాకముందే.. ఎక్కువగా ఈ సీజన్లో లభించేది మామిడి. మామడిని కొంతమంది వ్యాపారులు తక్కువ ధరకు కొనుగోలు చేసి కృత్రిమంగా పండించి వినియోగదారులకు ఎక్కువ ధరకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. కాయలు పూర్తిగా దిగుబడి దశకు రాక ముందే రసాయనాలతో మగ్గించి మార్కెట్లోకి తీసుకువస్తున్నారు. తర్భూజ, ఖర్భూజ, దోసకాయ తదితర పండ్లు త్వరగా పెరిగేందుకు ఇంజక్షన్ల ద్వారా రసాయనాలను ఇస్తున్నారు. గ్యాస్ వెల్డింగ్‌కు వినియోగించే కాల్షియం కార్బొరైట్‌ను కొనుగోలు చేసి కుప్పగా పోసిన కాయల్లో నాలుగు వైపులా వీటిని అమరుస్తారు. 50కిలోల కాయలకు 30 వరకు పొట్లాలను పెడతారు. ఈ గుళికలు పౌడర్‌గా మారి వేడి పుట్టిస్తాయి. ఇలా కాయలు తొందరగా పక్వానికి వచ్చి పచ్చగా మెరుస్తాయి. ఖర్భూజ, దోసకాయలు ఎదగడానికి వివిధ రకాల ఇంజక్షన్లు ఇస్తున్నారు. దీంతో విత్తనం నాటిన రెండుమూడు నెలల్లో దిగుబడి రావాలి్సన కాయలు నెల పదిహేను రోజుల్లోనే ఎదిగి కోతకు వస్తున్నాయి. ఆరోగ్యానికి హానికరం.. రసాయనాలతో పండించిన పండ్లను తినడం ద్వారా నరాలు బలహీనపడటంతో పాటు తలనొప్పి, మగతగా ఉండడం, ఫిట్స్ రావడం, మతిమరుపు రావడం వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్యనిపుణులు పేర్కొంటున్నారు. అలాగే కాలే యం, మూత్రపిండాలు, జీర్ణాశయంపై కూడా తీవ్ర ప్రభావం పడుతుందంటున్నారు. ఇలా పండ్ల వ్యాపారం ఉమ్మడి జిల్లాలో ఏటా రూ.50కోట్ల పైనే జరుగుతోంది. నిర్మల్, మంచిర్యాల, ఆదిలాబాద్, బెల్లంపల్లి, కాగజ్‌నగర్, ఆసిఫాబాద్ పట్టణాల్లో ఎక్కువగా ఈ పండ్ల గోదాములున్నాయి. జిల్లాలో భానుడి ప్రతాపం.. జిల్లాలో ఏటా వివిధ రకాల కాయలు, పండ్లు పూర్తిస్థాయిలో దిగుబడి రాకముందే ఎదిగే దశలోనే తెంపి రసాయనాలతో మార్కెట్ తీసుకువచ్చి విక్రయిస్తున్నారు. ఏటా మార్చి నెలలోనే ఇది మొదలవుతోంది. జిల్లాలో భానుడు అగ్నిగుండంగా మండిపోతున్నాడు. కొద్ది రోజులుగా వేసవి తీవ్రత పెరగడంతో ప్రజలు ఇప్పటినుంచే భయపడిపోతున్నారు. ఈ వేడి నుంచి ఉపశమనం పొందేందుకు జిల్లా వాసులు చల్లచల్లని పానీయాలతో పాటు తాజా పండ్లు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. వేసవి సీజన్ లో దొరికే అన్ని రకాల ఫలాలు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. కర్భుజా, ద్రాక్ష, సంత్ర, బొప్పాయి, దోసకాయ, మామిడి పండ్ల రసాలు మార్కెట్లో అందుబాటులో ఉన్నాయి. జిల్లా కేంద్రంలోని శివాజీ చౌక్, గాంధీ చౌక్, అంబేద్కర్ చౌక్, వినాయక్ చౌక్, ఎన్టీఆర్ చౌక్ తదితర ప్రధాన కూడళ్లలో తోపుడు బండ్లపై అమ్మకాలు జరుపుతుంటారు. నిర్మల్, మంచిర్యాల, బెల్లంపల్లి, కాగజ్‌నగర్ వంటి పట్టణ కేంద్రాల్లోనూ ఈ అమ్మకాలు జోరుగా సాగుతాయి. హైకోర్టు నిబంధనలు గాలికి.. పండ్లను సహజంగానే మగ్గబెట్టి విక్రయించాలని, అలా కాకుండా వివిధ రకాల రసాయనాలు, కార్బొరైట్‌ను వినియోగించి పండ్లను మాగబెడితే వారిపై చట్ట ప్రకారం కటిన చర్యలు తీసుకోవాలని హైకోర్టు 2016లో రెండు తెలుగు రాష్ట్రాలను ఆదేశించింది. అయినా వ్యాపారులు మాత్రం మారడం లేదు. ప్రస్తుత వేసవి సీజన్ లో పండ్లను ఇలాగే మాగేస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. అధికారులు ఎప్పుడో ఒకప్పుడు నామమాత్రంగా తనిఖీలు చేస్తున్నా.. కఠినంగా వ్యవహరించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ప్రాణ నష్టం జరగకముందే పట్టించుకుని పండ్ల గోదాములు, దుకాణాలపై పర్యవేక్షణ పెట్టాలని ప్రజలు కోరుతున్నారు.