పుష్కర స్నానానికి వెళ్తుండగా..
పుష్కర స్నానాలు చేసేందుకు సంగమేశ్వరానికి వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు
– ట్రాక్టర్ బోల్తా.. మహిళ మృతి
– ఆరుగురికి గాయాలు
చెలిమిల్ల (పాములపాడు): పుష్కర స్నానాలు చేసేందుకు సంగమేశ్వరానికి వెళ్తున్న భక్తులు రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వీరు ప్రయాణిస్తున్న ట్రాక్టర్ మార్గమధ్యంలో బోల్తా పడటంతో ఓ మహిళ మృతి చెందగా, మరో ఆరుగురు గాయపడ్డారు. గడివేముల మండలం బొల్లవరం గ్రామానికి చెందిన కొందరు పుణ్య స్నానాలు చేసేందుకు సంగమేశ్వరానికి బయలుదేరారు. మార్గమధ్యంలో కొర్రపోలూరు గ్రామంలోని మరి కొంత మందిని ఎక్కించుకున్నారు. దుద్యాల– చెలిమిల్ల గ్రామాల మధ్యన ముందు వెళ్తున్న ట్రాక్టరును ఓవర్‌టేక్ చేయబోతుండగా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కొర్రపోలూరు గ్రామానికి చెందిన సుభద్రమ్మ(32) అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె వెంట ఉన్న ఇద్దరు చిన్నారులు సురక్షితంగా బయట పడ్డారు. ట్రాక్టర్ ఓ వైపు కాల్వ గట్టుపై పడటంతో ప్రమాద తీవ్రత తగ్గింది. గాయపడిన కష్ణవేణమ్మ, సుబ్బలక్ష్మి, మహేశ్వరి, భానుప్రకాష్, మౌలిక, సురేఖను ఆత్మకూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ డ్రై వర్ పరారీలో ఉన్నాడు.