
ఉల్లంఘనులకు సన్మానం
♦ హెల్మెట్ పెట్టుకోకుంటే పూలదండ వేసి సెల్యూట్
♦ ట్రాఫిక్ పోలీసుల గాంధీగిరి
నిజామాబాద్ క్రైం: ద్విచక్ర వాహనదారులు.. తస్మాత్ జాగ్రత్త! హెల్మెట్ లేకుండా బయటికి వెళ్తే నడిరోడ్డుపై ‘సన్మానం’ తప్పదు! వాహనదారుల్లో మార్పు తెచ్చేందుకు ట్రాఫిక్ పోలీసులు ఈ తరహా చర్యలు చేపట్టనున్నారు. ఇక నుంచి హెల్మెట్ లేకుండా వెళ్లే వారిని పట్టుకొని రోడ్డుపై సత్కరించనున్నారు. హైదరాబాద్‌లో అమలవుతోన్న ఈ విధానాన్ని రెండు, మూడ్రోజుల్లో ఇక్కడా అమలు చేయనున్నారు. ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వాహనదారుల్లో మార్పు తెచ్చేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు వినూత్న రీతిలో సత్కరిస్తున్నారు. హెల్మెట్లు ధరించని వారి మెడలో పూలదండలు వేసి, సెల్యూట్ చేసి అభినందిస్తున్నారు. నడిరోడ్డుపై ఈ తరహా ‘సన్మానం’ వల్ల వాహనదారుల్లో మార్పు కనిపిస్తోంది. గతంలో జిల్లా కేంద్రంలో కూడా ఈ తరహాలోనే గులాబీ పూలతో సత్కరించారు.
ఉల్లం‘ఘనులపై’ కొరఢా.
హెల్మెట్ల వాడకంపై సుప్రీంకోర్టు మార్గదర్శకాలను కచ్చితంగా అమలు చేయాలని ఎస్పీ చంద్రశేఖర్‌రెడ్డి ట్రాఫిక్ సిబ్బందికి స్పష్టం చేశారు. ఇటీవల నిర్వహించిన రోడ్డు ప్రమాద నివారణ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు. ముందు పోలీసులే తప్పకుండా హెల్మెట్లు వాడాలని ఆయన సూచించారు. దీంతో రంగంలోకి దిగిన ట్రాఫిక్ పోలీసులు ఉదయం నుంచి సాయంత్రం వరకు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈ నెల 1 నుంచి 18 వరకు నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 1,417 కేసులు నమోదు చేసి, రూ. 4.95 లక్షల మేర జరిమానా విధించారు. హెల్మెట్ వినియోగం వల్ల కలిగే ప్రయోజనాలపై పోలీసులు వాహనదారులకు ప్రత్యక్షంగా, పరోక్షంగా అవగాహన కల్పిస్తున్నారు. కూడళ్లలో మైక్‌ల ద్వారా ప్రచారం చేస్తున్నారు.
కొన్ని ప్రాంతాలకే పరిమితం..
అయితే, పోలీసుల తనిఖీలు జిల్లా కేంద్రంలో రెండు, మూడు ప్రాంతాలకే పరిమితమయ్యాయి. ఎన్టీఆర్ చౌరస్తా (ధర్నాచౌక్), బస్టాండ్ ఎదుట, పూలాంగ్ చౌరస్తాలలో మాత్రమే స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఆర్మూర్ రోడ్డు, వినాయక్‌నగర్, వర్ని రోడ్డు, మాలపల్లి, బోధన్ రోడ్డు, అర్సపల్లి ప్రాంతాలలో తనిఖీలు చేపట్టడం లేదు. జిల్లా కేంద్రంలోని అన్ని ప్రధాన రహదారులపై తనిఖీలు నిర్వహిస్తే వాహనదారుల్లో మార్పు వచ్చే అవకాశముంది.
రోడ్డుపై ‘సత్కరిస్తాం..’!
ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాల్సిందే. రోడ్డు ప్రమాదాల్లో తలకు తీవ్రమైన గాయాలై ఎక్కువ మంది చనిపోతున్నారు. హెల్మెట్లు ధరిస్తే ప్రాణాలను రక్షించుకోవచ్చనే విషయాన్ని వాహనదారులు గుర్తించాలి. ఈ మేరకు వారిలో మార్పు రావాలి. ఇక నుంచి హెల్మెట్లు లేకుండా తిరిగే వారిని పట్టుకొని రోడ్డుపైనే అందరి ముందు సత్కరిస్తాం. - శేఖర్‌రెడ్డి, ట్రాఫిక్ సీఐ