ట్రాన్స్‌ ఫార్మర్ల కష్టాలు | Trans Former Difficulties | Sakshi
Sakshi News home page

ట్రాన్స్‌ ఫార్మర్ల కష్టాలు

Published Tue, Dec 20 2016 11:27 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

ట్రాన్స్‌ ఫార్మర్ల కష్టాలు - Sakshi

ట్రాన్స్‌ ఫార్మర్ల కష్టాలు

  •  పైసలిస్తేనే మరమ్మతులు
  • రవాణా ఖర్చూ రైతులే భరించాలి
  • ప్రశ్నిస్తే నిబంధనల పేరుతో వేధింపులు
  • రోజుల తరబడి కార్యాలయాల  చుట్టూ తిప్పుకుంటున్న వైనం
  • విద్యుత్‌ శాఖ అధికారుల తీరుపై  రైతుల అసంతృప్తి

  • తాడిపత్రి :  
    వ్యవసాయ విద్యుత్‌ ట్రాన్స్ ఫార్మర్లు కాలిపోయినా, చెడిపోయినా 24 గంటల్లో వాటి స్థానంలో మరొకటి కానీ, నూతన ట్రాన్స్ ఫార్మర్లు కానీ ఏర్పాటు చేయాల్సిన బాధ్యత విద్యుత్‌ శాఖ అధికారులది. రైతులు ఫిర్యాదు చేసిన వెంటనే సదరు ట్రాన్స్ ఫార్మర్ ను లైన్మెన్   స్వయంగా మరమ్మతుల కేంద్రానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన వాహనంలో తరలించారు. మరమ్మతు చేయించి.. తిరిగి తీసుకొచ్చి యథాస్థానంలో అమర్చాలి. ఇందుకోసం రైతుల నుంచి రూపాయి కూడా వసులు చేయరాదు. కానీ వాస్తవ పరిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉంది. ట్రాన్స్ ఫార్మర్ కాలిపోయినా, చెడిపోయినా రైతులే స్వయంగా మరమ్మతు కేంద్రానికి తీసుకెళ్లాల్సి వస్తోంది.  రవాణా ఖర్చులు కూడా వారే భరిస్తున్నారు. పోనీ ట్రాన్స్ ఫార్మర్ సకాలంలో మరమ్మతు చేసి పంపిస్తారా అంటే అదీ లేదు. సవాలక్ష కారణాలు చెబుతూ రైతులను తిప్పుకుంటున్నారు. రూ.వేలల్లో అధికారులకు, సిబ్బందికి ముట్టజెబితే గానీ పని కావడం లేదు. ఈలోపు ట్రాన్స్ ఫార్మర్ లేక నీటి సరఫరా ఆగిపోయి పంటలు ఎండిన సందర్భాలు అనేకం ఉన్నాయి. తాడిపత్రిలో రెండు మరమ్మతు కేంద్రాలు ఉన్నాయి. విద్యుత్‌ శాఖ తాడిపత్రి సబ్‌డివిజన్ పరిధిలోని యల్లనూరు, పుట్లూరు, తాడిపత్రి రూరల్, పెద్దపప్పూరు, యాడికి మండలాల్లో ట్రాన్స్ ఫార్మర్ పాడైతే రైతులే వాటిని మరమ్మతు కేంద్రాలకు తీసుకొస్తున్నారు. ఆటోలు లేదా ఇతర వాహనాల్లో తీసుకొచ్చి.. ఇక్కడ డబ్బిచ్చి పని చేయించుకుంటున్నారు. ఒక్కో ట్రాన్స్ ఫార్మర్ మరమ్మతు కోసం రూ.5 వేల నుంచి రూ.10వేల వరకు ఖర్చుచేయాల్సి వస్తోందని వారు వాపోతున్నారు. డబ్బు ఎందుకు ఇవ్వాలని అడిగితే..  మీరు అధిక విద్యుత్‌ వాడుతున్నారని, అసలు కనెక్షన్లే లేవని..ఇలా పలువిధాలుగా వేధిస్తున్నట్లు చెబుతున్నారు.

     

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement