మంత్రుల సమక్షంలో పార్టీ నేతల ఘర్షణ!
ఆదిలాబాద్: ఆదిలాబాద్ జిల్లా సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. శనివారం జరిగిన సమావేశంలో అధికార పార్టీలో విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. రాష్ట్ర మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న ఎదుటే జడ్పీ సభ్యులు ఒకరినొకరు దూషించుకున్నారు. జడ్పీటీసీలు, ఎంపీటీసీ సభ్యులు కూడా ఈ సందర్భంగా వాగ్వివాదానికి దిగి ఘర్షణ పడ్డారు.
'తమాషా చూస్తున్నారా, ఇదేమైనా మీ జాగీరనుకున్నారా' అని మంత్రి జోగు రామన్న మండిపడ్డారు. ఎమ్మెల్యే కోవ లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్ తనపై కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని జడ్పీటీసీల రాష్ట్ర ఫోరం అధ్యక్షుడు హేమాజీ మంత్రులకు ఫిర్యాదు చేశారు. ఆయన చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఎంపీటీసీ సభ్యులు పట్టుబట్టగా ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. అక్కడే ఉన్న మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జోగు రామన్న వారించడంతో గొడవ సద్దుమణిగింది.