ప్రభుత్వానికి బతుకమ్మ ఆడే అర్హత లేదు
కరీంనగర్(గోదావరిఖని): మహిళలపై దోపిడీ, దౌర్జన్యం, హింసకు కారణమవుతున్న ప్రభుత్వానికి బతుకమ్మ ఆడే నైతిక అర్హత లేదని తెలంగాణ మహిళా, సాంస్కృతిక సంఘాల ఐక్యవేదిక నాయకులు అన్నారు. మంగళవారం కరీంనగర్ జిల్లా గోదావరిఖనిలో ‘గడీల బతుకమ్మ కాదు.. బడుగుల బతుకమ్మలాడుదాం, స్త్రీలపై హింసలేని తెలంగాణ సాధిద్దాం’ అనే నినాదంతో కార్యక్రమాన్ని నిర్వహించారు. పీవోడబ్ల్యూ అధ్యక్షురాలు సంధ్య, ఐద్వా అధ్యక్ష, కార్యదర్శులు ఆశాలత, బి.హైమావతి, తెలంగాణ ప్రజా సాంస్కృతిక వేదిక నాయకురాలు హిమబిందు, అమరుల బంధుమిత్రుల సంఘం నాయకురాలు పద్మకుమారి, అంజమ్మ, చైతన్య మహిళా సంఘం నాయకురాలు జయ, దేవేంద్ర, తెలంగాణ ఆడబిడ్డల వేదిక అధ్యక్ష, కార్యదర్శులు చెరుకు లక్ష్మి, కోలా వనిత, ఇతర నాయకులు రహీమున్సీసా, మహేశ్వరి తదితరులు మాట్లాడారు.
బడుగుల పండుగను అగ్రకుల మనువాద రాజ్యం నేడు మార్కెట్ మాయాజాలంలో ముంచాలని చూస్తోందని, ఈ ప్రమాదం నుంచి బతుకమ్మను బతికించుకోవాల్సిన అవసరముందని పేర్కొన్నారు. మద్యంతో సామాన్యుల బతుకుల్లో చిచ్చుపెడుతూ రూ. వేల కోట్ల కొల్లగొడుతున్న సర్కారు.. బతుకమ్మ ఉత్సవాలు జరిపేందుకు మాత్రం రూ.10 కోట్లు కేటాయించడం సిగ్గుచేటన్నారు. శ్రుతిపై లైంగికదాడి చేసి హత్య చేసిన పోలీసులపై నిర్భయ చట్టం కింద కేసు నమోదు చేసి శిక్షించాలని, రాజ్యహింసతో పాటు మహిళలపై జరుగుతున్న హింసను అరికట్టాలని వారు డిమాండ్ చేశారు.