గులాబీకే పట్టం! | trs win in siddipet elections | Sakshi
Sakshi News home page

గులాబీకే పట్టం!

Published Thu, Apr 7 2016 3:36 AM | Last Updated on Wed, Aug 15 2018 9:30 PM

గులాబీకే పట్టం! - Sakshi

గులాబీకే పట్టం!

హరీశ్ వెంటే సిద్దిపేట పట్టణ ఓటరు!
ఇదివరకే ఆరింటిలో ఏకగ్రీవం
మిగతా 28 వార్డుల్లోనూ గెలుపు ధీమా

 పురపోరులో సిద్దిపేట ఓటరు గులాబీ దళానికే జైకొట్టినట్టు తెలుస్తోంది. మంత్రి హరీశ్‌కు సలామ్ కొట్టారని.. అధికార పార్టీకే పట్టం కట్టారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఓటింగ్ సరళి తరువాత వారు ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది. ప్రతిపక్ష పార్టీలు, రెబల్స్ ఏకమై అరిచి గీపెట్టినా.. వార్ వన్ సైడే అయ్యిందని చెబుతున్నారు. ఇదివరకే ఆరు వార్డులు ఏకగ్రీవమై టీఆర్‌ఎస్ ఖాతాలో పడ్డాయి. కాగా బుధవారం 28వార్డులకు ఎన్నికలు జరగ్గా అన్ని చోట్ల కారు జోరు సాగిందన్న ప్రచారం జరుగుతోంది. మంత్రి హరీశ్‌రావు పిలుపు మేరకు పట్టణ ఓటర్లు క్లీన్ స్వీప్ దిశగా తీర్పు ఇవ్వబోతున్నారన్న సమాచారం. - సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి

సిద్దిపేట అంటేనే టీఆర్‌ఎస్ అన్నట్టుగా ఆ పార్టీ ఈ ప్రాంతంలోని ప్రజల్లోకి చొచ్చుకుపోయింది. ఎన్నికలు ఏవైనా ఇక్కడ గెలిచేది గులాబీ పార్టీ అనే విషయం చాలా సందర్భాల్లో రుజువైంది. అసెంబ్లీ, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, పంచాయతీ, మున్సిపాలిటీ ఇలా ఎలాంటి ఎన్నికలైనా ఓటర్లు మాత్రం కేసీఆర్, హరీశ్‌రావు పక్షాన నిలుస్తారనడంలో సందేహం లేదు. బుధవారం జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ ఇలాగే జరిగిందని పలువురు రాజకీయ విశ్లేషకులు ఓటింగ్ సరళిని పరిశీలించి చెబుతున్నారు. హరీశ్‌రావు కోరిక మేరకు ప్రజలు అన్ని స్థానాల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులనే గెలి పించబోతున్నారని అభిప్రాయపడుతున్నారు.

 గట్టిపోటీనిచ్చిన స్థానాలు...
పలు స్థానాల్లో టీఆర్‌ఎస్ తిరుగుబాటు దారులే పైచేయి సాధిస్తున్నారని, వీరికి కాంగ్రెస్, టీడీపీ మద్దతు పలకడంతో కారు టైరు పంక్చర్ ఖాయమనే ప్రచారం జరిగింది. 10, 14, 17, 30, 33, 34వ వార్డుల్లోనైతే ప్రత్యర్థుల విజయం ఖరారైనట్టుగా ప్రచారం ఊపందుకుంది. పోలింగ్ పూర్తయిన తరువాత వారి అంచనాలు తప్పని తేలినట్టు సమాచారం.

10వ వార్డు టీఆర్‌ఎస్ అభ్యర్థి మచ్చ వేణుగోపాల్‌రెడ్డి తిరుగుబాటు అభ్యర్థితో తీవ్రంగా పోటీ పడ్డారు. మాజీ కౌన్సిలర్ నవీన భర్త కరాటే కృష్ణ ఆయన మీద పోటీ చేయడంతో వేణుగోపాల్‌రెడ్డికి ఇబ్బందిగా మారింది.

14వ వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థి సంపత్‌రెడ్డి, బీజేపీ అభ్యర్థి దూది శ్రీకాంత్‌రెడ్డిల మధ్య పోటీ తీవ్రంగా ఉన్నట్టు ప్రచారం జరిగింది.

17వ వార్డులోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థి నాయకం లక్ష్మణ్, బీజేపీ అభ్యర్థి వెంకట్ మధ్య హోరాహోరీగా సాగింది.

♦  30వ వార్డులో టీఆర్‌ఎస్ అభ్యర్థి పూజల వెంకటేశ్వరరావుకు కాంగ్రెస్ అభ్యర్థి వజీర్‌ఖాన్ గట్టి పోటీ ఇచ్చినట్టు పుకార్లు వచ్చాయి.

♦  టీఆర్‌ఎస్ పట్టణ అధ్యక్షుడు నయ్యర్ సతీమణికి స్వతంత్ర అభ్యర్థి గట్టిపోటీ ఇచ్చినట్టు ప్రచారం జరిగింది.

 ప్రత్యర్థులకు ఓటరు చెక్..!
పలు వార్డుల్లో ప్రతిపక్ష పార్టీల అభ్యర్థులు గెలుస్తున్నారని సోషల్ మీడియాలో హల్‌చల్ చేసినా... కొన్ని మీడియా సంస్థలు ఆ పుకార్లకే వంతపాడినా... ప్రజలు మాత్రం గులాబీ పార్టీకే మొగ్గుచూపినట్టు సమాచారం. టికెట్ రాలేదని మంత్రి హరీశ్‌రావు అనుచరులే తిరుగుబాటు చేసినా వారికి నిరాశే ఎదురైనట్టు తెలిసింది. ఒకటి, రెండు వార్డుల్లో టీఆర్‌ఎస్ అభ్యర్థుల మెజార్టీ తగ్గినా... గెలుపు మాత్రం ఖాయమని పలు సర్వే సంస్థలు చెబుతున్నాయి. పోలింగ్ ముగిసిన అనంతరం మంత్రి హరీశ్‌రావు ఓటింగ్ సరళిపై నిర్వహించిన సమీక్షలోనూ అన్ని వార్డుల్లోనూ టీఆర్‌ఎస్ అభ్యర్థులే గెలవబోతున్నారనే విషయం తేలినట్టు తెలిసింది.

పోలీసుల ప్రతాపం....
ఎన్నికల్లో పోలీసులు సామాన్య జనంపై ప్రతాపం చూపించారు. ఓటు వేయడానికి వచ్చిన వారిపై లాఠీలతో విరుచుకుపడ్డారు. సాధారణంగా ఎక్కడైనా పోలీసులు అధికార పక్షం వైపు మొగ్గు చూపారని ఫిర్యాదులు రావటం సహజం. కానీ సిద్దిపేటలో మాత్రం పోలీసుల తీరు అందుకు భిన్నంగా ఉన్నట్టు ఫిర్యాదులు వచ్చాయి. 23, 14, 28, 32, 33వ వార్డుల్లో పోలీసులు టీఆర్‌ఎస్ కార్యకర్తలపై దాడి చేసినట్టు ఆ పార్టీ నాయకులు మంత్రి హరీశ్‌రావుకు ఫిర్యాదు చేశారు.

ప్రధానంగా ఇద్దరు ఎస్‌ఐలు, ఒక సీఐ పనికట్టుకొని గులాబీ దళానికి వ్యతిరేకంగా పని చేసినట్టు, వారిపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయాలని కార్యకర్తలు మంత్రిపై ఒత్తిడి తెచ్చారు. మరోవైపు మంత్రి హరీశ్‌రావుకు సన్నిహితుడిగా గుర్తింపు పొందిన ఓ పోలీసు అధికారి 14వ వార్డులో టీఆర్‌ఎస్ మహిళా కార్యకర్తలను పరుష పదజాలంతో దూషించడం ఆ పార్టీ నేతలకు మింగుడు పడడం లేదు. కాగా కార్యకర్తలు చేస్తున్న ఆరోపణలకు ఆధారాలుంటే... ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేస్తామని మంత్రి హరీశ్‌రావు చెప్పినట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement