ప్రత్యామ్నాయమే శరణ్యం
♦ తిరుమలకు లింకు రోడ్డు నుంచి నాలుగులేన్ల విస్తరణ
♦ యోచిస్తున్న టీటీడీ యాజమాన్యం
సాక్షి,తిరుమల : ఎడతెరిపిలేని వర్షాల కారణంగా కొండ చరియలు కూలిపడి తిరుమల రె ండో ఘాట్‌రోడ్డు ధ్వంసమైన నేపథ్యంలో టీడీడీ ప్రత్యామ్నాయ మార్గాన్ని అన్వేషిస్తోంది. 13వ కిలోమీటరు నుంచి లింక్‌రోడ్డును నాలుగులేన్లుగా విస్తరించి రాకపోకలను వేరు చే యడమే సరైన ప్రత్యామ్నాయంగా ఆలోచిస్తోంది. అలిపిరి నుంచి తిరుమలకు 16 కిలోమీటర్ల మేర రెండో ఘాట్‌రోడ్డును 1973లో నిర్మించారు. ఈ మార్గంలో రెండేళ్లుగా ఏడో కిలోమీటరు నుంచి 16వ కిలోమీటరు వరకు కొండ చరియలు కూలిపడుతున్నాయి. అలిపిరి నుంచి 12వ కిలోమీటరు వద్ద హరిణి వరకు, అక్కడి నుంచి 13వ కిలోమీటరు లింక్‌రోడ్డు వరకు, అక్కడి నుంచి 16వ కిలోమీటరు తిరుమల వరకు.. ఇలా ఈ రోడ్డును మొత్తంగా మూడు సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. లింకురోడ్డు నుంచి తిరుమలకు వెళ్లే మూడు కిలోమీటర్ల ప్రాంతం దెబ్బతింది.
లింక్‌రోడ్డు విస్తరణతో సమస్యకు పరిష్కారం..
గత అనుభవాల దృష్ట్యా ముందు జాగ్రత్తగా రెండో ఘాట్‌రోడ్డులోని 13వ కిలోమీటరు నుంచి మొదటి ఘాట్‌రోడ్డుకు అనుసంధానంగా మూడు వందల మీటర్ల లింకురోడ్డు నిర్మించారు. ప్రస్తుతం ఈ మార్గం నుంచే వాహనాలను తిరుమలకు మళ్లించారు. ఇక్కడి నుంచి జీఎన్‌సీ వరకు మూడు కిలోమీటర్ల దూరంలో వాహనాలను అరగంటపాటు ఇటుఅటుగా ఆపేసి పంపుతున్నారు. భవిష్యత్‌లో ఇదే మార్గాన్ని వినియోగించుకోవాలంటే మూడు కిలోమీటర్ల దూరాన్ని నాలుగులేన్లుగా విస్తరించి రాకపోకలు వేరు చేయవచ్చు.
నిపుణులు ఓకే అంటే.. : ఈవో సాంబశివరావు
లింక్ రోడ్డు నుంచి తిరుమల జీఎన్‌సీ వరకు ఉండే మార్గాన్ని నాలుగు లేన్లగా విస్తరించాలని నిపుణులు సూచిస్తే తప్పనిసరిగా నిర్మిస్తాం.
నిపుణుల బృందం సందర్శన కొండ చరియలు కూలుతున్న తిరుమల రెండో ఘాట్‌రోడ్డును గురువారం ఐఐటీ నిపుణుల బృందం పరిశీలించింది. టీటీడీ జేఈవో కేఎస్ శ్రీనివాసరాజు నేతృత్వంలో న్యూ ఢిల్లీకి చెందిన కేఎస్ రావు, చెన్నయ్‌కు చెందిన నరసింహారావు, ఎల్‌అండ్‌టీ అధికారుల బృందం ఆ ప్రాంతాలను పరిశీలించింది. దాన్ని బాగు చేసేందుకు సుమారు 15 రోజులపైబడి పడుతుందని ప్రాథమిక అంచనాకు వచ్చారు.
అడ్డుగోడతోపాటు ఆధునిక పద్ధతుల్లో గ్రౌటింగ్ చేయాలని సూచించారు. కూలిన ప్రాంతాల్లో ఎక్కడికక్కడ అడ్డుగోడలు నిర్మించాలని, కూలేందుకు సిద్ధంగా ఉన్న ప్రాంతాల్లోనూ రాళ్లను పరిశీలించాలని చెప్పారు. భవిష్యత్‌లో భాష్యకార్ల సన్నిధి రోడ్డు బాగా దెబ్బతినే అవకాశం ఉందని, దీన్ని దృష్టిలో ఉంచుకుని లింక్‌రోడ్డును పూర్తి స్థాయిలో విస్తరించాలని సూచించారు. వర్షం పూర్తిగా నిలిచిన తర్వాత మరమ్మతులు చేపట్టాలని సూచించారు.ఘాట్‌రోడ్డులో శాశ్వత స్థాయి మరమ్మతులను ఎల్‌అండ్‌టీ ద్వారా చేపట్టాలని ప్రాథమికంగా నిర్ణయించారు.