కవలలతో 108 సిబ్బంది
బి.కొత్తకోట: పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని 108లో బి.కొత్తకోట ప్రాథమిక వైద్య కేంద్రానికి తరలిస్తుండగా మార్గం మధ్యలో ఆవాహనంలోనే కవలలకు జన్మనిచ్చింది. ఈ సంఘటన బుధవారం లె ల్లవారుజామున జరిగింది. వివరాలు..పెద్దతిప్పసముద్రం మండలం కందుకూరుకు చెందిన చల్లా సుజాత(24)కు పీటీఎంకు చెందిన సురేష్‌బాబుతో వివాహమైంది. సుజాత నిండుగర్భిణి కావడంతో పుట్టినిల్లు కందుకూరుకు వెళ్లింది. బుధవారం తెల్లవారుజాము 3గంటల సమయంలో సుజాతకు నొప్పులు తీవ్రం కావడంతో స్థానికంగా ఉన్న పీహెచ్‌సీకి తీసుకెళ్లారు. అక్కడ సిబ్బంది అందుబాటులో లేకపోవడంతో 108కు సమాచారం అందజేశారు. దీంతో ఆ వాహన ఈఎంటీ లోకేష్, పైలట్ ఎం.రాజులు ఆమెకు ప్రాథమిక చికిత్స అందించి బి.కొత్తకోటకు తరలిస్తుండగా 4.20 గంటలకు మద్దయ్యగారిపల్లె సమీపంలోకి రాగానే సుజాత 108లోనే మగ కవలలకు జన్మనిచ్చింది. అనంతరం కవలలు, బాలింత సుజాతను బి.కొత్తకోట పీహెచ్‌సీలో చేర్పించారు. అక్కడ వైద్యులు పరీక్షించి కవలలు ఆరోగ్యంగా ఉన్నారని నిర్దారించారు.