హత్య కేసులో నిందితుల అరెస్ట్
గూడూరు :
ఓ యువకుడి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు.
గూడూరు :
ఓ యువకుడి హత్య కేసులో ఇద్దరు నిందితులను పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేశారు. రెండో పట్టణ పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పట్టణ సీఐ సుబ్బారావు మాట్లాడుతూ పాతకక్షల నేపథ్యంలో ఈ నెల 8వ తేదీ తెల్లవారుజామున రెండో పట్టణంలోని ఎగువవీరారెడ్డిపల్లి ప్రాంతానికి చెందిన వెడిచర్ల చైతన్యను శ్రీహరి అలియాస్ జెమిని, లక్ష్మీనారాయణ కొట్టి హత్య చేసిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి నిందితులు పరారీలో ఉండగా సీఐ, ఎస్సై నరేష్ గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం నిందితులు స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉండగా వారిని అరెస్ట్ చేశామన్నారు. స్థానిక అరుంధతీయవాడకు చెందిన కనుపూరు రమణయ్య కుమారుడు శ్రీహరి అలియాస్ జెమిని వైన్ దుకాణం వద్ద కూల్ డ్రింక్స్ దుకాణం పెట్టుకుని జీవిస్తున్నాడు. రెండో నిందితుడు ఐసీఎస్ రోడ్డు ప్రాంతంలోని నాయుడుకాలువ కట్ట ప్రాంతానికి చెందిన పొంగూరు రమణయ్య కుమారుడు లక్ష్మీనారాయణ అలియాస్ నారాయణ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో గతంలో జెమినికి హతుడు చైతన్య స్నేహితుడు మహేష్‌కు క్రికెట్ ఆడుతుండగా ఘర్షణలు జరుగుతున్నాయి. దీంతో చైతన్య గతంలో పలుమార్లు తన స్నేహితుడు మహేష్ జోలికొస్తే చంపుతానని జెమినిని బెదిరించాడు. దీంతో జెమిని, లక్ష్మీనారాయణ చైతన్యను తుదముట్టించాలని అదను కోసం ఎదురు చూస్తుండగా గత సోమవారం అర్ధరాత్రి దాటాక సీవీజీ వైన్స్ ఎదురుగా చైతన్య ఎదురయ్యాడు. ఇదే అదనుగా భావించిన లక్ష్మీనారాయణ, జెమినీ కలిసి దుడ్డుకర్రతో చైతన్య తలపై కొట్టడంతో మృతి చెందాడు. ఈ మేరకు నిందితులిద్దరిని అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచినట్లు తెలిపారు. సమావేశంలో ఎస్సై నరేష్ పాల్గొన్నారు.