చెరువులో పడి ఇద్దరు చిన్నారుల మృతి
Published Wed, Sep 7 2016 12:30 AM | Last Updated on Mon, Sep 17 2018 8:02 PM
* గట్టుపై ఆడుకుంటూ ప్రమాదవశాత్తు పడి మృతి
* కన్నీరుమున్నీరవుతున్న తల్లిదండ్రులు
యడ్లపాడు: సాగునీటి చెరువు ఇద్దరు చిన్నారులను పొట్టనబెట్టుకుంది. మండలంలోని యడ్లపాడు, మైదవోలు గ్రామాల మధ్య ఉన్న అతి పెద్ద సాగునీటి సీతమ్మ చెరువులో మంగళవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. మండలంలోని మైదవోలు ఎస్సీ కాలనీకు చెందిన ధర్నాసి రాజు, జ్యోతి దంపతులకు ఇద్దరు సంతానం. పెద్ద కుమార్తె ప్రహర్షిత (6) యడ్లపాడులోని ఓ ప్రై వేటు స్కూల్‌లో యూకేజీ చదువుకుంటోంది. అదే కాలనీకి చెందిన జొన్నలగడ్డ బాలబాబు, పావని దంపతులకు ముగ్గురు సంతానం. వారిలో పెద్ద కుమార్తె సరస్వతి (7) కాలనీ సమీపంలోని ఆర్‌సీఎం ప్రాథమిక పాఠశాలలో ఒకటో తరగతి చదువుతోంది. మంగళవారం సాయంత్రం పాఠశాల నుంచి వచ్చిన వీరు కాలనీకి ఆనుకొని ఉన్న చెరువుకట్టపైకి చేరి ఆడుకుంటున్నారు. ప్రమాదవశాత్తూ కాలుజారి కట్టపై నుంచి చెరువు లోపలి వైపునకు పడిపోయారు. గతేదాడి, ఈ ఏడాది వరుసగా ఈ చెరువులో నీరు–చెట్టు పథకం కింద బాగా లోతుగా తవ్వకాలు చేశారు. ఇటీవలి వర్షాలకు ఆ ప్రాంతమంతా నీటితో నిండింది. కాలుజారి పడిన బాలికలు నీటిలో పూర్తిగా మునిగిపోవడంతో దూరంగా గమనిస్తున్న ప్రహర్షిత నాయినమ్మ అగస్టీనమ్మ కేకలు వేసింది. దీంతో సమీపంలో పశువులు కాసుకుంటున్న కాపరులు చెరువులోకి దిగి బాలికలను ఒడ్డుకు చేర్చారు. అప్పటికే ఇద్దరు చిన్నారులు నీటిలో ఊపిరాడక విగత జీవులుగా మారారు. సమాచారం అందుకున్న వీఆర్వో షేక్ బాషా, పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలను సేకరించారు. ఈ ఘటనతో ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
Advertisement