రెండు లారీలు ఢీ: ఒకరు మృతి
♦ రెండు లారీలు ఢీ క్యాబిన్లలో ఇరుకున్న డ్రైవర్లు, క్లీనర్లు
♦ మూడు గంటల పాటు అర్తనాదాలు
♦ మూడు గంటల తర్వాత చేరుకున్న 108 అంబులెన్సు
♦ ఒకరు మృతి.. ముగ్గురి పరిస్థితి విషమం
పిట్లం: మండల శివారులోని జాతీయ రహదారిపై గురువారం అర్ధరాత్రి రెండు లారీలు ఢీకొన్న దుర్ఘటనలో డ్రైవర్లు, క్లీనర్లు లారీ క్యాబిన్లలో ఇరుక్కుని మూడు గంటల పాటు నరకయాతన అనుభవించారు. కాపాడండీ కాపాడండీ అంటూ అర్తనాదాలు చేశారు. వారి రోదనలు విన్న ఇతర లారీల వారితో పాటు పిట్లం పోలీసులు జేసీబీ వాహనం తీసుకొచ్చి అతి కష్టం మీద బయటకు తీశారు. సుమారు మూడు గంటలైనా 108 అంబులెన్సు రాకపోవడంతో ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుటూ ఒకరు మృతి చెందారు. పిట్లం శివారులోని రవి పటేల్ దాబా సమీపంలోని మూల మలుపు ఈ ప్రమాదం జరిగింది.
నాందేడ్ నుంచి హైదరాబాద్ వెళ్తున్న లారీ, హైదరాబాద్ నుంచి నాందేడ్ వైపు వెళ్తున్న మరో లారీ ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదం జరిగిన విషయం తెలుసుకున్న ఏఎస్‌ఐ బాబురావు, కానిస్టేబుళ్లు సాయిలు, రాజ్‌కుమార్, హోంగార్డు గౌరి తదితరులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇతర వాహనాల చోదకులతో సహాయంతో వారిని బయటకు తీశారు. సుమారు అర్ధరాత్రి ఒంటి గంటకు 108 అంబెలెన్సు చేరుకుంది. అప్పటికే ఒకరు మృతి చెందారు. మిగతా ముగ్గురిని అంబులెన్సులో బాన్సువాడ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని కూడా అదే అంబులెన్సులో ఆస్పత్రికి తరలించారు. ఈ సంఘటనలో మృతి చెందిన, తీవ్రంగా గాయపడ్డ వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.