- విద్యుత్ శాఖలో వెలుగు చూసిన బాగోతం
- న్యాయం కోసం బాధితుల ఆందోళన
నిరుద్యోగులకు లంచాల షాక్
Published Thu, Aug 18 2016 11:49 PM | Last Updated on Sat, Sep 22 2018 8:22 PM
నెల్లిపాక:
నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పి లంచాలు దండుకుని మోసం చేసిన సంఘటన విద్యుత్ శాఖలో వెలుగు చూసింది. బాధిత యువకులు తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ నెల్లిపాక విద్యుత్ శాఖ కార్యాలయం ముందు గురువారం ఆందోళన చేశారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం ఎటపాక మండలంలోని విద్యుత్ శాఖలో 14 నెలలుగా ఆరుగురు ఐటీఐ పూర్తి చేసిన యువకులు డైలీవేజ్ పద్ధతిలో పనిచేస్తున్నారు. అయితే వీరికి నేటికి కూడా విద్యుత్ శాఖలోని సంబంధిత కాంట్రాక్టర్ వేతనాలు ఇవ్వలేదు. అవుట్‌సోర్సింగ్ విధానంలో ఫ్రాంచైజింగ్ స్టాఫ్ ఉద్యోగులుగా నియమిస్తామని చెప్పి వీరందరి వద్ద ఒకొక్కరి నుంచి రూ. 60 వేలు లంచాల రూపంలో వసూలు చేశారు. విద్యుత్‌శాఖ ఏడీఈ మధుసూదనరావు, కాంట్రాక్టర్ తిరుపతిరావుకు ఈమొత్తం ముట్టజెప్పినట్టు బాధితులు చెపుతున్నారు. ఎటపాక మండలంలో ఎనిమిది మందిని ఇప్పటికే ఫ్రాంచైజింగ్ స్టాఫ్ ఉద్యోగులుగా నియమించగా వీరిలో కేవలం మండలానికి చెందిన ఒక్కరికే ఉద్యోగం లభించింది. వేరే మండలాలకు చెందిన గిరిజనులను మిగిలిన పోస్టుల్లో నియమించారు. వారు విధుల్లో చేరేందుకు నెల్లిపాక ఏఈ కార్యాలయానికి రాగాలంచాలు ఇచ్చి మోసపోయిన యువకులు వారిని అడ్డుకున్నారు. ఏఈ మురళీకృష్ణను కార్యాలయంలో ఉంచి గది తలుపులు వేసి బాధితులు ఆందోళన నిర్వహించారు. మండలంలోని వారికే ఉద్యోగ అవకాశం కల్పించాలని వారు డిమాండ్ చేశారు. లంచాలు తీసుకుని తమను ఏడీఈ, కాంట్రాక్టర్ మోసం చేసినట్టు పోలీసులకు ఫిర్యాదు చేశామని వారు తెలిపారు. ఎంపీపీ శ్యామలత, పలు పార్టీల నాయకులు బాధితులకు న్యాయం చేయాలంటూ వారి ఆందోళనకు మద్దతు పలికారు.
Advertisement
Advertisement