మహబూబ్‌నగర్ : విద్యుత్ శాఖ ఇంజనీరింగ్ అధికారి ఒకరు లంచం తీసుకుంటూ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. అధికారుల కథనం ప్రకారం... మహబూబ్‌నగర్ జిల్లా కోడేర్ మండల విద్యుత్ శాఖా కార్యాలయంలో అడిషనల్ అసిస్టెంట్ ఇంజనీర్‌గా టి.గంగాధర్‌రావు అనే వ్యక్తి పనిచేస్తున్నారు. కాగా అదే మండలంలోని రాజాపూర్ గ్రామానికి చెందిన నాగేందర్ అనే రైతుతోపాటు మరికొందరు రైతులు 2011లో ట్రాన్స్‌ఫార్మర్ కోసం దరఖాస్తు చేసుకుని డీడీలను చెల్లించగా గత ఏడాది వర్క్ ఆర్డర్ 2014 లో మంజూరయ్యాయి.
దీనిపై రైతులు ఏఏఈ గంగాధర్‌రావును సంప్రదించగా ఆయన రూ.25 వేల రూపాయల లంచం డిమాండ్ చేశారు. అయితే రైతులు మొదటి విడతగా రూ.10 వేలు ఇచ్చేందుకు అంగీకరించి ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. ఈ క్రమంలో వలపన్నిన ఏసీబీ అధికారులు, బస్టాండ్ సమీపంలోని ఓ హోటల్‌లో గంగాధర్‌రావుకు రైతులు డబ్బు అందజేస్తుండగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. వెంటనే ఏఏఈని టూటౌన్ పోలీస్‌స్టేషన్ తరలించారు. ఈ కేసుకు సంబంధించి ప్రభుత్వానికి నివేదిక అందజేయనున్నట్లు ఏసీబీ డీఎస్పీ రాందాస్ తేజ తెలిపారు.