ప్చ్..!
- నిరాశ మిగిల్చిన లోకేష్ పర్యటన
- ఒక్క సమస్యకూ పరిష్కారం చూపని మంత్రి
- జెడ్పీటీసీ, ఎంపీటీసీ సభ్యుల్లో నిరుత్సాహం
కర్నూలు(అర్బన్): ముఖ్యమంత్రి చంద్రబాబు తనయుడు, రాష్ట్ర పంచాయతీ రాజ్ శాఖా మంత్రి నారా లోకేష్ తొలిసారి మంత్రి హోదాలో కర్నూలుకు వచ్చిన సందర్భంగా తమ సమస్యలకు కొంతైనా పరిష్కారం లభిస్తుందని ఆశించిన స్థానిక ప్రజా ప్రతినిధులకు నిరాశ మిగిలింది. శుక్రవారం మంత్రి లోకేష్ కర్నూలు వచ్చిన సందర్భంగా స్థానిక జిల్లా పరిషత్ సమావేశ భవనంలో ఏపీ పంచాయతీరాజ్ ఛాంబర్ ఆధ్వర్యంలో మంత్రికి సన్మానంతో పాటు స్థానిక సంస్థలకు చెందిన ప్రజా ప్రతినిధులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఛాంబర్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిర్రు ప్రతాపరెడ్డి వినతిపత్రాన్ని మంత్రికి అందించారు.
ఈ కార్యక్రమానికి జిల్లాలోని సర్పంచు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ సభ్యులు, ఎంపీపీలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ముందుగా సర్పంచుల సంఘం అధ్యక్షుడు సిద్దారెడ్డి శ్రీధర్‌రెడ్డి, ఎంపీటీసీల సంఘం జిల్లా అద్యక్షుడు డీ వాసు, జెడ్పీటీసీల సంఘం అధ్యక్షుడు ఇ మీనాక్షినాయడు పలు సమస్యలను క్లుప్తంగా వివిరించారు. సాయంత్రం 6 గంటలకు కార్యక్రమం ప్రారంభం కాగానే 14వ ఆర్థిక సంఘం నిధులు మండల పరిషత్, జిల్లా పరిషత్‌లకు కేటాయించాలని, జిల్లాలోని సర్పంచులకు ఉన్న జాయింట్ చెక్‌పవర్‌ను రద్దు చేయాలని, ఎస్‌డీపీ నిధులను ఎంపీటీసీ, జెడ్పీటీసీలకు కేటాయించాలని వినతి పత్రం ద్వారా కోరారు. గ్రామ పంచాయతీలపై విద్యుత్ బిల్లుల భారం పడకుండా, ప్రభుత్వమే బిల్లులు చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలని, మండల, జిల్లా పరిషత్తులకు నాళా నిధులు రూ.360 కోట్లను కేటాయిస్తామని అప్పటి ఇంచార్జి మంత్రి అచ్చెన్నాయుడు ఇచ్చిన హామీని గుర్తు చేశారు.
అలాగే స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులకు వేతనాలు పెంచాలని, అన్ని జిల్లా పరిషత్ కార్యాలయాల్లో పంచాయతీరాజ్ చాంబర్‌కు ఒక గదిని కేటాయించాలని కోరారు. అయితే మంత్రి ప్రసంగంలో కేవలం తాను మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటివరకు అమలు చేస్తున్న 7 స్టార్స్ పథకాలను వల్లె వేశారు. అలాగే బడ్జెట్‌తో ముడిపడి ఉన్న అంశాలను పీఆర్ ముఖ్య కార్యాదర్శి జవహర్‌రెడ్డితో మాట్లాడి చర్యలు చేపడతామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమైన అంశాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. ఫైనాన్స్‌తో సంబంధం లేని పలు అంశాలతో పాటు మిగిలిన అంశాలను కూడా మంత్రి లోకేష్ దాటవేసే ధోరణిలో చెప్పడంతో స్థానిక ప్రజా ప్రతినిధులు నిరాశ చెందారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి, జిల్లా పరిషత్ చైర్మన్ మల్లెల రాజశేఖర్, ఎమ్మెల్సీ శిల్పా చక్రపాణిరెడ్డి, ఎమ్మెల్యేలు బీసీ జనార్దన్‌రెడ్డి, జయనాగేశ్వరరెడ్డి, మణిగాంధీ, జిల్లా కలెక్టర్ ఎస్ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.