ఉసురు తీస్తున్న పరిహారం
ఉసురు తీస్తున్న పరిహారం
Published Tue, May 16 2017 2:39 AM | Last Updated on Tue, Nov 6 2018 8:28 PM
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణంలో భూములు కోల్పోతున్న రైతుల ఖాతాల్లో జమ అవుతున్న పరిహారం సొమ్ము వివాదాలకు కారణమవుతోంది. అక్కడక్కడా కొందరి ఉసురు తీస్తోంది. కొన్ని భూములకు సంబంధించిన వివాదాలు పరిష్కారం కాకుండానే పరిహారం వేరే వారి బ్యాంకు ఖాతాల్లో జమ కావడంతో సమస్యలు తలెత్తుతున్నాయి. పరిహారం సొమ్ముల కోసం ఓ కొడుకు కన్నతల్లినే మట్టుబెట్టగా.. పరిçహారం అందలేదన్న ఆవేదనతో ఒక వృద్ధుడు ఆత్మహత్య చేసుకున్నాడు.
భూమి ఒకరిది.. పేరు మరొకరిది
కుక్కునూరు, వేలేరుపాడు మండలాల్లో సేకరించిన భూములకు సంబంధించి పలుచోట్ల సివిల్ వివాదాలు ఉన్నాయి. 1/70 చట్టం రాకముందు కొనుగోలు చేసిన భూములు, ల్యాండ్ సీలింగ్‌లో ఉన్న భూములను వేరేవారి పేరుతో ఉసురు తీస్తున్న పరిహారం రికార్డుల్లో నమోదు చేశారు. ఆ వివాదాలు పరిష్కారం కాకుండానే.. భూమి ఎవరి పేరుతో ఉంటే.. వారి ఖాతాల్లో అధికారులు పరిహారం సొమ్ము జమ చేశారు. దీంతో అసలు రైతులు ఆవేదన చెందుతున్నారు. దశాబ్దాల తరబడి భూములు తమ ఆధీనంలోనే ఉన్నా వేరే వారి ఖాతాల్లో పరిహారం జమ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఈ నెల 11న పోలవరం పరిహారం సొమ్ము కోసం కన్నతల్లిని కుమారుడే కర్రతో కొట్టి చంపిన ఘటన కుక్కునూరు మండలం కమ్మరిగూడెంలో చోటుచేసుకుంది. రాయిని సత్యవతి అనే వృద్ధురాలిని ఆమె చిన్నకొడుకు శ్రీను కర్రతో కొట్టి చంపాడు. పోలవరం ప్రాజెక్ట్ కోసం భూమి ఇచ్చిన దృష్ట్యా సత్యవతి అకౌంట్లో రూ.30 లక్షలు జమ అయ్యాయి. ఆ సొమ్మును తన రెండో అన్న రమేశ్‌కు ఇచ్చేస్తుందేమోనని భావించిన శ్రీను ఆ సొమ్ము కాజేయడం కోస ఆమెను చంపేశాడు. తాజాగా, సోమవారం కుక్కునూరుకు చెందిన ఓలేటి సత్యనారాయణ గోదావరిలో మునిగి చనిపోయాడు. పరిహారం విషయమై కుటుంబ సభ్యుల మధ్య తలెత్తిన గొడవల వల్లే అతను ఆత్మహత్య చేసుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. కుటుంబ సభ్యులు మాత్రం ప్రమాదవశాత్తు కాలుజారి మరణించాడని చెబుతున్నారు.
దళితుల భూముల్ని కాజేసి..
పోలవరం ప్రాజెక్ట్ ముంపు పరిధిలో.. దళితులకు సంబంధించిన భూములను పెత్తందారులు కాజేసి దొంగ పత్రాలతో వారి పేరిట మార్చుకున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కుక్కునూరు మండలం సీతారామనగరం గ్రామ దళితులు ఈ అంశంపై ఉన్నతాధికారులను ఆశ్రయించారు. 1965–75 మధ్య కాలంలోని రెవెన్యూ అడంగల్ పహాణీలను బయటపెట్టకుండా.. భూసేకరణ అధికారులు 2000 సంవత్సరం తర్వాత రికార్డులను మాత్రమే పరిగణనలోకి తీసుకుంటున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇలాంటి ఫిర్యాదులతో కుక్కునూరు పోలీస్ స్టేషన్‌కు బాధితులు క్యూ కడుతున్నారు. ఎక్కువ ఫిర్యాదులు సివిల్ పరిధిలో ఉండటంతో కేసులు నమోదు చేయడానికి పోలీసులు ముందుకు రావడం లేదు.
Advertisement
Advertisement