ఇది హృదయావిష్కరణ
సాక్షి, సిటీబ్యూరో: ‘ఎవ్వరో ఈ బిడ్డలూ... నింగిలో నెలవంకలూ’ అనే పాటతో జయరాజు తన హృదయాన్ని ఆవిష్కరించారని గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ అన్నారు. కవి, గాయకుడు జయరాజు రాసిన ‘వసంతగీతం’, ‘జ్ఞాపకాలు’ పుస్తకాలను గురువారం రవీంద్రభారతిలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అశోక్ తేజ మాట్లాడుతూ సూర్యచంద్రులు కలిస్తే జయరాజేనని కొనియాడారు.
సినీ నటుడు, దర్శకుడు ఆర్.నారాయణమూర్తి మాట్లాడుతూ జయరాజు సింగరేణి నల్లబంగారమని ప్రస్తుతించారు. ప్రభుత్వ మాజీ కార్యదర్శి కాకి మాధవరావు మాట్లాడుతూ చివరి వరకు ఎర్ర జెండాను మోసిన నిజమైన విప్లవకారుడు జయరాజని అభిప్రాయపడ్డారు. ఈ కార్యక్రమంలో వేణు మాధవ్, విమలక్క, పోటు రంగారావు, మోహన్, రాయల రమ, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.