కాకినాడ : కులాల మధ్య చిచ్చు పెట్టే అలవాటు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబుకే ఉందని కాంగ్రెస్ పార్టీ నేతలు సి.రామచంద్రయ్య, వట్టి వసంత్కుమార్ ఆరోపించారు. ఆదివారం తూర్పుగోదావరి జిల్లా తునిలో జరుగుతున్న కాపు ఐక్య గర్జన సదస్సుకు సి. రామచంద్రయ్య, వట్టి వసంత్కుమార్ విచ్చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... కాపులపై చంద్రబాబుకు చిత్తశుద్ధి లేదని ఆరోపించారు.
గతంలో ఏర్పాటు చేసిన పుట్టుస్వామి కమిషన్ ఉండగా మరో కమిషన్ ఎందుకు అని చంద్రబాబును ప్రశ్నించారు. 50 శాతానికి మించి రిజర్వేషన్లు అమలు చేయవచ్చని వారు అభిప్రాయపడ్డారు. కాపులను బీసీల్లో చేర్చేంతవరకు పార్టీలకతీతంగా ఉద్యమాన్ని కొనసాగిస్తామని సి. రామచంద్రయ్య, వట్టి వసంత్కుమార్ చెప్పారు.