‘వెదుళ్ళపల్లి’ భూమి రెవెన్యూ శాఖదే
‘వెదుళ్ళపల్లి’ భూమి రెవెన్యూ శాఖదే
Published Thu, Jul 21 2016 4:00 PM | Last Updated on Mon, Sep 4 2017 5:41 AM
ఆ భూమిలో నలుగురికి పట్టాలు కూడా ఉన్నాయి
అటవీశాఖకు ఎలాంటి సంబంధం లేదు
పంట ధ్వంసంపై ఉన్నతాధికారులకు నివేదిక
సర్వే తర్వాత తేల్చి చెప్పిన తహసీల్దార్ యూసఫ్ జిలానీ
వై.రామవరం :
మండలంలోని కోట పంచాయతీ, వెదుళ్ళపల్లి గ్రామంలో అటవీశాఖాధికారులు శనివారం జీడిమామిడి చెట్లను ధ్వంసం చేసిన భూమి రెవెన్యూ శాఖదని తహసీల్దార్ ఎండీ యూసఫ్ జిలానీ తెలిపారు. రెండు రోజుల పాటు 20 ఎకరాల ఆ భూమిని తమ సర్వేయర్ లక్ష్మణరావుతో సర్వే చేయించాక ఈ విషయాన్ని ధ్రువీకరిస్తున్నామని తహసీల్దార్ బుధవారం ఆ గ్రామంలో విలేకరులకు తెలిపారు. ఆ భూమిపై అక్కడి గిరిజన రైతులకే హక్కు ఉందని సృష్టం చేశారు. ఈ భూమితో అటవీశాఖకు ఎలాంటి సంబంధం లేదని తహసీల్దార్ తేల్చి చెప్పారు. వెదుళ్లపల్లి గ్రామానికి చెందిన వడబాల సత్యవతి, వడబాల చల్లయ్యమ్మ, వడబాల బుల్లెమ్మ, వెలుగూరి నాగమ్మలకు ఈ భూములపై పట్టాలు కూడా ఉన్నాయన్నారు. అలాగే పల్లాల కర్రిరెడ్డి, పల్లాల మంగిరెడ్డిలు పట్టాలు లేకుండా సాగు చేసుకుంటున్న ఐదు ఎకరాలు కూడా రెవెన్యూ భూమేనన్నారు. అటవీ శాఖ అధికారులు ఈ భూముల్లో ట్రాక్టర్లతో దున్నించడం వల్ల ఆరుగురు గిరిజన రైతులూ జీడిమామిడి మొక్కలను నష్టపోయిన విషయాన్ని నివేదిక రూపంలో కలెక్టర్, సబ్‌కలెక్టర్, అటవీశాఖ ఉన్నతాధికారులకు పంపిస్తున్నామన్నారు. కార్యక్రమంలో ఆ గ్రామ మాజీ సర్పంచ్ గొర్లె మంగయ్య, ముర్ల జోగిరెడ్డి , గ్రామపెద్దలు, బాధితులు పాల్గొన్నారు.
అటవీశాఖాధికారులపై చర్యలు తీసుకోవాలి : ఎమ్మెల్యే
వెదుళ్లపల్లి గ్రామంలో గిరిజనుల భూముల్లోని జీడిమామిడి చెట్లను ట్రాక్టర్లతో దున్నించి, ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఎమ్మెల్యే వంతల రాజేశ్వరి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బుధవారం ఆమె ‘సాక్షి’తో మాట్లాడారు. ఈ గ్రామంలో ఆరుగురు గిరిజనులు పెంచుకుంటున్న జీడిమామిడి చెట్లను అటవీ శాఖాధికారులు శనివారం ట్రాక్టర్లతో దున్నుతూ ధ్వంసం చేస్తుండగా, తహసీల్దార్ యూసఫ్ జిలానీ సమక్షంలో ఎమ్మెల్యే రాజేశ్వరి అడ్డుకున్న విషయం తెలిసిందే. రెండు రోజుల సర్వే అనంతరం ఆ భూమితో అటవీశాఖకు ఎలాంటి సంబంధం లేదని సృష్టమైంది. ఈ నేపధ్యంలో జీడిమామిడి చెట్లను ధ్వంసం చేసిన అటవీశాఖ అధికారులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఎమ్మెల్యే బుధవారం ప్రభుత్వాన్ని డిమాం డ్ చేశారు. మరో ఏడాదిలో దిగుబడి వచ్చే జీడిమామిడి చెట్లను కోల్పోయిన ఆరుగురు రైతులకు ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.
Advertisement
Advertisement