వాల్మీకిపురం: ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ప్రాణాలను కాపాడేందుకు కుటుంబ సభ్యులు ప్రయత్నం చేశారు.. కానీ చివరికి రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన చిత్తూరు జిల్లాలో బుధవారం చోటుచేసుకుంది. కురబలకోట మండలం మట్లివారిపల్లెకు చెందిన వెంకట్ రమణ (25) కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకోవాలనుకున్నాడు. మంగళవారం సాయంత్రం విషపు గుళికలు మింగాడు.
కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లెలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో రాత్రి ప్రైవేట్ అంబులెన్స్‌లో తిరుపతి స్విమ్స్‌కు తరలించేందుకు బయలుదేరారు. తెల్లవారుజామున వాల్మీకిపురం సమీపంలోని సబ్‌జైలు వద్ద అంబులెన్స్ బోల్తా పడింది. ఈ ప్రమాదంలో వెంకట్రమణ అక్కడికక్కడే మృతిచెందాడు. అంబులెన్స్ డ్రైవర్ ప్రశాంత్ తీవ్రంగా గాయపడ్డాడు. అతనిని వెంటనే తిరుపతి స్విమ్స్‌కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.