మీసాల వెంకన్న బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Published Mon, Oct 3 2016 10:30 PM | Last Updated on Mon, Sep 4 2017 4:02 PM
యానాం టౌన్ :
మీసాల వెంకన్నగా ప్రసిద్ధి చెందిన యానాం భూసమేత వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో స్వామివారి చతుర్ధశి బ్రహ్మోత్సవాలు సోమవారం ఘనంగా ప్రారంభమయ్యాయి. యానాం వేంకటేశ్వర దేవస్థాన ఆలయ సముదాయ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 12 వరకు నిర్వహించే ఈ బ్రహ్మోత్సవాలను ప్రాంతీయ పరిపాలనాధికారి దవులూరి సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఎïస్పీ నితిన్ గోహల్ ఆలయ ప్రాంగణంలో స్వామివారి జయపతాకాన్ని ఎగురవేసి ప్రారంభించారు. ప్రముఖ వైఖానస వేదపండితులు వాడపల్లి గోపాలాచార్యుల ఆధ్వర్యంలో ఉదయం ఆలయంలో సంకల్పం, దీక్షాధారణ, దిగ్దేవతా ప్రార్థన వంటి పూజలను వేదమంత్రాలతో శాస్త్రోక్తంగా నిర్వహించారు. అలాగే తిరుమల తరహాలో ఆరాధనోత్సవాలు, ప్రత్యేకఉత్సవాలలో భాగంగా వివిధ పూజా కార్యక్రమాలను ప్రత్యేకగంగా ఏర్పాటు చేసిన యాగశాలలో 10 మంది రుత్వికులు, ఆలయఅర్చకులు జరిపించారు. పరిపాలనాధికారి, ఎస్పీతో పాటు దేవస్థాన కమిటీ అధ్యక్షుడు కాపగంటి ఉమాశంకర్, కమిటీ ప్రతినిధులు స్వామివారిని దర్శించుకుని పూజలు చేశారు. వందలాది మంది భక్తులు తరలివచ్చి
బ్రహ్మోత్సవ కార్యక్రమాలను తిలకించారు.
Advertisement