
బంజారాహిల్స్‌లో రూ. 18కోట్లతో వెంకన్న ఆలయం
హైదరాబాద్‌లోని బంజారాహిల్స్ ప్రాంతంలో రూ. 18 కోట్లతో శ్రీ వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని నిర్మించాలని తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) పాలకమండలి నిర్ణయించింది. టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన మంగళవారం జరిగిన సమావేశంలో ఈ మేరకు పలు నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో కొత్త ముత్యపు పందిరి, సర్వభూపాల వాహనం తయారీకి రూ. 3.86 కోట్లు కేటాయించాలని నిర్ణయించారు. అర్చకుల సంక్షేమ నిధికి రూ. 25 కోట్లు మంజూరు చేశారు.
స్వామివారి శఠగోపాల తయారీకి రూ. 72 లక్షలు కేటాయించారు. కెన్యా రాజధాని నైరోబీలో మే 22న వేంకటేశ్వర స్వామి కల్యాణం నిర్వహిస్తారు. ఒంటిమిట్ట ఆలయంలో కొత్త కళ్యాణమండపం నిర్మిస్తారు. యాత్రకుల ఉచిత సముదాయానికి రూ. 4.6 కోట్లు కేటాయించారు. హిందూ ధర్మ ప్రచార పరిషత్తుకు రూ. 50 లక్షలు మంజూరుచేశారు. తిరుమల వెంగమాంబ నిత్యాన్న ప్రసాద భవనం, కొత్త వంటపాత్రల కొనుగోలుకు రూ. 30 లక్షలు మంజూరు చేశారు.