ప్రైవేటు కళాశాలల్లో విజిలెన్స్ తనిఖీలు
Published Sat, Jul 16 2016 6:40 PM | Last Updated on Sun, Sep 2 2018 3:39 PM
భద్రాచలం : ఖమ్మం జిల్లా భద్రాచలంలోని మూడు ప్రైవేటు కళాశాలలను రీజినల్ విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు తొలిసారిగా శుక్రవారం తనిఖీ చేశారు. విజిలెన్స్, ఎన్‌ఫోర్స్ మెంట్ ఏఎస్పీ సురేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో సీఐ వెంకటేష్, సీఐడీ సీఐ సదానిరంజన్, ఏసీబీ సీఐ రమణమూర్తి, విజిలెన్స్ ఇంజనీరింగ్ అధికారి భానుప్రకాష్, ఎఫ్‌ఆర్‌ఓ అహ్మద్ మియా, మాధవరావు తదితరులు రెండు బృందాలుగా తనిఖీలు సాగించారు. చర్ల రోడ్డులోగల కళాశాలలో విద్యార్థులకు తగిన వసతులు లేకపోవడాన్ని, వెలుతురు లేని గదుల్లోనే తరగతులు నిర్వహిస్తుండడాన్ని గుర్తించారు. అర్హతగల అధ్యాపకులు లేకుండానే కళాశాల నిర్వహిస్తున్నారని, రికార్డుల్లో నమోదు చేసిన మేరకు విద్యార్థులు లేరని తనిఖీ బృందం గుర్తించినట్టు సమాచారం.
ఐటీడీఏ రోడ్‌లోగల కళాశాలను తనిఖీ చేసిన ఈ బృందం.. అక్కడ అనేక లోపాలను గుర్తించినట్టు తెలిసింది. నిబంధనలకు విరుద్ధంగా ఒకే క్యాంపస్‌లో వివిధ కోర్సులకు సంబంధించిన కళాశాలను నిర్వహిస్తుండడాన్ని, బాలిబాలికలకు అదే క్యాంపస్‌లోనే హాస్టల్ ఏర్పాటు చేయడాన్ని అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఇక్కడ కూడా అర్హత గల అధ్యాపకులు లేరని, విద్యార్థులకు తగిన వసతులు లేవని అధికారులు గుర్తించినట్టు తెలిసింది. ఈ రెండు బృందాలు తమ తనిఖీలలో గమనించిన అవకతవకలపై ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నట్టు సమాచారం. ఈ అధికారులు శనివారం కూడా భద్రాచలంలోని మరికొన్ని కళాశాలలను పరిశీలిస్తారు. తనిఖీ వివరాలను వెల్లడించేందుకు విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు అంగీకరించలేదు. తమ పరిశీలనలో తేలిన అంశాలతో ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని చెప్పారు.
Advertisement
Advertisement