విద్యుత్ చౌర్యంపై విజిలెన్స్ దాడులు
-
195 మందిపై చర్యలు, కేసుల నమోదు
-
రూ.27.7 లక్షల జరిమానా
నెల్లూరు (అర్బన్) : 8 జిల్లాల ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ ఎస్‌ఈ రవి ఆధ్వర్యంలో జిల్లాలో విద్యుత్ చౌర్యానికి పాల్పడుతున్న వారిపై గుంటూరు, ప్రకాశం నుంచి వచ్చిన అధికారులు మెరుపు దాడులు నిర్వహించారు. కావలి, వింజమూరు, నెల్లూరు, గూడూరు డివిజన్ తదితర ప్రాంతాల్లో ఈ దాడులు జరిగాయి. ఆక్వా రంగం, పారిశ్రామిక ప్రాంతాల్లో దాడులు నిర్వహించారు. నెల్లూరు బీవీనగర్ తదితర ప్రాంతాల్లో ఇళ్ల కనెక‌్షన్లను తనిఖీ చేశారు. విద్యుత్ భవన్ అతిథి గృహంలో ఎస్పీడీసీఎల్ విజిలెన్స్ ఎస్‌ఈ వి.రవి విలేకరులకు వివరాలు వెల్లడించారు. కావలి, కోట తదితర ప్రాంతాల్లో విద్యుత్ చౌర్యం చేస్తున్న ఆక్వా రంగానికి చెందిన ఐదుగురిపై , వ్యాపార రంగానికి చెందిన ముగ్గురిపై కేసులు నమోదు చేశామన్నారు. గృహ విద్యుత్ కనెక‌్షన్ తీసుకుని వ్యాపార రంగానికి వినియోగిస్తున్న 30 మందిపై, అదనపు లోడ్‌తో విద్యుత్‌ను చౌర్యం చేస్తున్న 142 మందిని పట్టుకున్నామన్నారు. మొత్తం 195 మంది నుంచి రూ.27.7 లక్షలను జరిమానా విధించామన్నారు. తొలిసారిగా విద్యుత్ చౌర్యానికి పాల్పడిన వారిపై భారీగా జరిమానా విధిస్తున్నామన్నారు. రెండో సారి దొరికిన ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టుకు కేసును అప్పగించామన్నారు. ఇతర జిల్లాల నుంచి ప్రత్యేకంగా విజిలెన్సు అధికారులు వచ్చి దాడులు చేసి ఇన్ని కేసులు నమోదు చేస్తుంటే స్థానిక అధికారులు ఒక్క దొంగ కేసును కూడా ఎందుకు పట్టుకోలేక పోయారని విలేకరులు ప్రశ్నించగా సమాధానాన్ని దాటవేశారు. చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్ (అడిషనల్‌ఎస్పీ) ఎ.మనోహర్, డీఈ రమేష్, సిఐ ఎం.నాగేశ్వరి తదితరులు పాల్గొన్నారు.