వెతలు | wage problom's in government office's | Sakshi
Sakshi News home page

వెతలు

Published Sat, Jul 2 2016 1:52 AM | Last Updated on Mon, Sep 4 2017 3:54 AM

వెతలు

వెతలు

జీతాలు పెరగక ఎన్‌ఎంఆర్ ఉద్యోగుల అవస్థలు చివరగా 2013లో పెంపు
ఈ ఉత్తర్వులు రెండేళ్లకే పరిమితం
తాజా ఉత్తర్వుల కోసం 15 నెలలుగా నిరీక్షణ సత్వరం పెంచాలని విజ్ఞప్తి
పట్టించుకోని అధికారులు

సంగారెడ్డి టౌన్: వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేసే దినసరి వేతన జీవుల జీతాలు పెరగక అవస్థలు పడుతున్నారు. జీతాలు పెంచుతూ 2013లో ఉత్తర్వులు జారీ చేశారు. ఆ ఉత్తర్వులు రెండేళ్లకే పరిమితం. గడువు ముగిసి 15 నెలలు దాటినా తాజా ఉత్తర్వులు రావడం లేదు. ప్రస్తుత ధరలను సమీక్షించి అందుకు అనుగుణంగా కొత్తగా వేతనాలు నిర్ణయిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు కోరుతున్నారు. ఇందుకోసం కార్మిక శాఖ కార్యాలయం చుట్టూ చెప్పులరిగేలా తిరుగుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారు. జీతాల పెంపుకోసం ఎదురు చూపులతో కాలం గడుపుతున్నారు.

 జిల్లాలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో దినసరి వేతనంతో పనిచేస్తోన్న నాన్ మస్టర్ రోల్ స్టాఫ్ (ఎన్‌ఎంఆర్) ఉద్యోగులు జీతాలు పెరగక ఇబ్బందులు పడుతున్నారు. జీతాల పెంపునకు సంబంధించిన అప్పటి కలెక్టర్, డిప్యూటీ లేబర్ కమిషనర్లు జారీ చేసిన ఉత్తర్వుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు. కార్మిక శాఖ కార్యాలయం  చుట్టూ ఎన్నిసార్లు తిరిగినా లాభం లేకపోయింది. నాటి ధరలకు అనుగుణంగా 2013లో అప్పటి కలెక్టర్ స్మితా సబర్వాల్ ఉత్తర్వులు జారీ చేశారు. నిత్యావసర ధరలు రెండేళ్లలో పదింతలు పెరిగాయని, జీతాలు సరిపోక ఇబ్బందులు పడుతున్నామని ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

పెరిగిన నిత్యావసర ధరలకు అనుగుణంగా వేతనాలు పెంపు ఉత్తుర్వుల కోసం గత 15 నెలలుగా ఎదురు చూస్తున్నామన్నారు. ప్రభుత్వం శాఖల్లో పనిచేస్తున్న ఔట్ సోర్సింగ్, కాంట్రాక్టు ఉద్యోగుల జీతాలు పెంచారని, తమ జీతాలు కూడా పెంచాలని వారు కోరుతున్నారు. ఈ విషయమై కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా.. పాత ఉత్తర్వులు కొనసాగుతున్నాయని చెప్పారు. జిల్లాలో మొత్తం ఎంతమంది ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు ఉన్నారో తమ వద్ద  సమాచారం అందుబాటులో లేదని చెప్పడం గమనార్హం.

 చివరిసారిగా 2013 నవంబరులో ఉత్తర్వులు...
ఎన్‌ఎంఆర్ ఉద్యోగులకు సంబంధించిన కమిటీకి కలెక్టర్ చైర్మన్, కన్వీనర్‌గా కార్మిక శాఖ డిప్యూటీ కమిషనర్, వివిధ శాఖలకు చెందిన అధికారులు సభ్యులుగా ఉంటారు. డిసెంబర్ 2011లో ఈ ఉద్యోగుల జీతాలు పెంచారు. ఆపై రెండేళ్లకోసారి అప్పటి నిత్యావసర ధరలకు అనుగుణంగా జీతాలు పెంచుతూ 19 నవంబర్ 2013న అప్పటి కలెక్టర్ ఆదేశాలతో డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్ ఉత్తర్వులు నం.సి/1393/2013 విడుదల చేశారు. ఈ ఉత్తర్వులు మార్చి 2015 వరకు అమలులో ఉంటుందని అందులో సూచించారు. ఆ ఉత్తర్వుల గడువు అయిపోయి 15 నెలలుగడిచింది. దాంతో సదరు ఉద్యోగులు జీతాల పెంపు కోసం ఎదురుచూస్తున్నారు.

 2013లో నిర్ణయించిన రోజువారి వేతనాలు..
అన్‌స్కిల్డ్ ఉద్యోగులైన మజ్దూర్, చౌకీదార్, అటెండర్, స్వీపర్, క్యాజువల్ లేబర్లకు గ్రామీణ ప్రాంతాల్లో రోజుకు రూ. 245, పట్టణ ప్రాంతంలో రూ. 255గా నిర్ణయించారు. సెమీ స్కిల్డ్ ఉద్యోగుల రికార్డ్ అసిస్టెంట్, మిల్క్ రికార్డర్, మిల్క్ మ్యాన్, మిల్కర్, ఇతరులకు గ్రామీణ ప్రాంతంలో రూ. 295, పట్టణం ప్రాంతంలో 305, స్కిల్డ్ ఉద్యోగులైన కార్పెంటర్, క్లర్క్, టైపిస్ట్, స్టెనో, ఎలక్ట్రిషియన్, డ్రైవర్లకు గ్రామీణ ప్రాంతాల్లో రూ. 330, పట్టణ ప్రాంతాల్లో రూ. 345గా నిర్ణయించారు. ఇప్పటికీ ఇవే వేతనాలను చెల్లిస్తున్నారు.

 పాత ఉత్తర్వులే అమల్లో..
ఇప్పటికీ పాత ఉత్తర్వులే కొనసాగుతున్నాయి. ఈ ఉత్తర్వులు 2013లో జారీ అయ్యాయి. జిల్లాలో ఎంతమంది ఎన్‌ఎంఆర్ ఉద్యోగులు పనిచేస్తున్నారో పూర్తి వివరాలు మా దగ్గర ఉండవు.  - కోటేశ్వరరావు, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ లేబర్

కార్మిక కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాం...
గతంలో ఇచ్చిన ఉత్తర్వుల కాలం చెల్లింది. 15 నెలలు దాటినా కొత్తగా ఉత్తర్వులు జారీ కాలేదు. పెరిగిన ధరలకు అనుగుణంగా కొత్తగా జీతాలు నిర్ణయించాలని పలుమార్లు అధికారులకు విన్నవించాం. కార్మిక శాఖ అధికారులను చాలాసార్లు కలిసాం. అయినా పట్టించుకోవడం లేదు.  - శివకుమార్, ఎన్‌ఎంఆర్ ఉద్యోగి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement