కుంటాల జలపాతం(ఆదిలాబాద్)
సాక్షి,వీకెండ్: జలపాతాలు జలజల పారుతున్నాయి.. పచ్చని పరిసరాలు ఆనందం, ఆహ్లాదం పంచుతున్నాయి... మరెందుకాలస్యం పదండి జలపాత్రయం...
– కోన సుధాకర్‌రెడ్డి
జలపాతాలకు ఆదిలాబాద్ జిల్లా పెట్టింది పేరు. మూడు ప్రముఖ జలపాతాలు కుంటాల, పొచ్చెర, కనకాయ్ ఈ జిల్లాలోనే ఉన్నాయి. అందుకే దీనికి జలపాత్రయం అనే పేరొచ్చింది.
కుంటాల...
తెలంగాణలోనే పెద్ద జలపాతం ఇది. ఆదిలాబాద్ జిల్లాలోని నేరేడిగొండ మండలంలో కడెం నదీపై ఉందీ. హైదరాబాద్ నుంచి 250 కి.మీ దూరం. సిటీ నుంచి నిర్మల్ (210 కి.మీ) వెళ్లి, అక్కడి నుంచి నేరేడిగొండ (30) వెళ్లాలి. నేరేడిగొండ నుంచి 10కి.మీ దూరంలో ఉందీ జలపాతం. సిటీ నుంచి నిర్మల్‌కు, అక్కడి నుంచి నేరేడిగొం డకు బస్ సౌకర్యం ఉంది. నేరేడిగొండ నుంచి ప్రైవేట్ వాహనాల్లో కుంటాల చేరుకోవచ్చు.
పొచ్చెర...
ఇక్కడ గోదావరి గలగలలు మీకు స్వాగతం పలుకుతాయి. చిన్న చిన్న జలపాతాలు జలజలపారుతూ మిమ్మల్ని మైమరిపిస్తాయి. ఇది ఆదిలాబాద్ జిల్లా కేంద్రం నుంచి 47 కి.మీ దూరంలో ఉంది. నగరం నుంచి నిర్మల్‌కు 210 కి.మీ దూరం. బస్ సౌకర్యం ఉంది. అక్కడి నుంచి పొచ్చెర జలపాతానికి వాహనాలు ఉంటాయి.
కనకాయ్...
కనకాయ్ జలపాతాన్ని ట్రెక్కింగ్ చేసేవారు ఎక్కువగా ఇష్టపడతారు. ఇది సిటీ నుంచి 260 కి.మీ దూరంలో ఉంది. నిర్మల్ నుంచి 50 కి.మీ దూరంలో ఉంటుంది. నగరం నుంచి నిర్మల్‌కు బస్ సౌకర్యం ఉంది. అక్కడి నుంచి వాహనాల్లో కనకాయ్ చేరుకోవచ్చు.
టీఎస్‌టీడీసీ ఆధ్వర్యంలో...
తెలంగాణ స్టేట్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (టీఎస్‌టీడీసీ) బృందాలుగా వెళ్లే వారి కోసం ప్రత్యేక వాహనాలు సమకూరుస్తోంది. వివరాలకు 040– 6674 6370,6674 5986, 98485 40371 నంబర్లలో సంప్రదించొచ్చు.