
‘వైఎస్ జగన్ ఆదేశిస్తే రాజీనామాకు సిద్ధం’
నెల్లూరు : ప్రత్యేక హోదాకి ప్రత్యేక ప్యాకేజీ ప్రత్యామ్నాయం కాదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ మేకపాటి రాజమోహన్ రెడ్డి అన్నారు. రాష్ట్రం అభివృద్ధి చెందాలంటే ప్రత్యేక హోదానే కీలకమని ఆయన అభిప్రాయపడ్డారు. ఎంపీ మేకపాటి గురువారమిక్కడ విలేకర్లతో మాట్లాడుతూ ఆ విషయం తెలిసే వెంకయ్య నాయుడు రాజ్యసభలో ప్రత్యేక హోదా గురించి మాట్లాడిన విషయాన్ని గుర్తు చేశారు. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత హోదాను మరిచి ఆర్థిక సాయం మంచిదంటున్నారని ఆయన ధ్వజమెత్తారు.
పార్లమెంట్లో ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని మేకపాటి స్పష్టం చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశిస్తే రాజీనామా చేసేందుకు తాము సిద్ధమని ఆయన తెలిపారు. కాగా ప్రత్యేక హోదా విషయంలో అవసరమైతే ఎంపీ పదవికి రాజీనామా చేసేందుకు వెనుకాడబోమని పార్టీ మరో ఎంపీ బుట్టా రేణుక...కర్నూలులో జరిగిన యువభేరిలో ప్రకటన చేసిన విషయం తెలిసిందే.