
అన్నదాతలను ఆదుకోకపోతే చరిత్ర క్షమించదు
–ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడవు
– విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్
కోదాడ: అందరికి అన్నం పెట్టే అన్నదాతలు కష్టాల్లో ఉన్న సమయంలో ఆదుకోవాల్సిన పాలకులు ఆ పని చెయకపోతే చరిత్ర క్షమించదని, ఎద్దు ఏడ్చిన వ్యవసాయం.. రైతు ఏడ్చిన రాజ్యాలు బాగుపడవని విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్ అన్నారు. రైతుల రుణమాఫీ నిధులను ఒకే సారి చెల్లించాలని కోరుతూ సామాజిక ఉద్యమకారుడు కొల్లు వెంకటేశ్వరరావు కోదాడ బస్టాండ్ వద్ద చేపట్టిన ఒక రోజు రైతుభరోసా దీక్ష ముగింపు కార్యక్రమంలో ఆయన పాల్గొని దీక్ష విరమింపజేశారు. ఎన్నికల సమయంలో రుణమాఫీ హమీ ఇచ్చిన ప్రభ్వుత్వం ఎన్నికల అనంతరం విడతల వారి విధానాన్ని తీసుకొచ్చి అవి కూడ సకాలంలో చెల్లించక పోవడం వల్ల రైతులకు అప్పు పుట్టని పరిస్థితి ఏర్పడిందన్నారు. ప్రభుత్వం వడ్డీతో సహ లక్ష రూపాయల రుణాన్ని వెంటనే చెల్లించాలని ఆయన డిమాండ్ చేశారు. నూటికి 70 శాతం మంది ఆధారపడ్డ వ్యవసాయరంగాన్ని అన్ని ప్రభుత్వాలు నిర్లక్ష్యం చెస్తున్నాయన్నారు. నకిలీ విత్తనాలు, నాశిరకం పురుగుమందులు, మార్కెట్ దళారులు ఇలా ప్రతి దశలో అన్నదాత నిలువు దోపిడీకి గురవుతున్నారన్నారు. వేల కోట్ల రూపాయలను ఎగగొడుతున్న వారికి బ్యాంకులు అప్పులు ఇస్తున్నాయని, కానీ అన్నం పెట్టే రైతును బ్యాంకు గడపతొక్కనియ్యడం లేదన్నారు. అంతే కాకుండా పాత అప్పుతో సంబంధం లేకుండా రైతులకు కొత్త రుణాలను ఇప్పించే బాధ్యతను కూడ ప్రభుత్వమే తీసుకోవాలని కోరారు. మార్కెట్‌ల ప్రక్షాళన చేసి దళారులను లేకుండా చెయాలని కోరారు. ఉదయం కొల్లు వెంకటేశ్వరరావు చేపట్టిన దీక్షను రైతుసంఘం నాయకుడు దొడ్డ నారాయణరావు ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో నాయకులు పొడుగు హుస్సేన్, గంధం బంగారు, రావెళ్ల రవికుమార్, మేకల శ్రీనివాస్, బొల్లు ప్రసాద్, కత్రం నాగేందర్‌రెడ్డి, కనగాల జనార్ధన్‌రావు తదితరులు పాల్గొన్నారు. వివిధ పార్టీల నాయకులు, సంఘాల నేతలు ఈ దీక్షకు మద్దతు తెలిపారు.