దద్దమ్మలా నోరు మూసుకుని ఉన్నారు.. కాంగ్రెస్‌ నేతలపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌ | CM KCR Comments At Kodad Public Meeting Slams Congress BJP | Sakshi
Sakshi News home page

దద్దమ్మలా నోరు మూసుకుని ఉన్నారు.. కాంగ్రెస్‌ నేతలపై సీఎం కేసీఆర్‌ ఫైర్‌

Published Sun, Oct 29 2023 3:20 PM | Last Updated on Sun, Oct 29 2023 3:58 PM

CM KCR Comments At Kodad Public Meeting Slams Congress BJP - Sakshi

సాక్షి, సూర్యాపేట: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటు వేసేటప్పుడు ప్రజలు విజ్ఞతతో ఆలోచన చేయాలని సీఎం కేసీఆర్‌ అన్నారు. నాయకులు ఏం చేశారు, భవిష్యత్తులో ఏం చేస్తారనేది ఆలోచించాలని పేర్కొన్నారు. ఓటు మన చేతిలో బ్రహ్మస్త్రమని, మన భవిష్యత్తును నిర్ణయిస్తుంది. పంటపొలాలు ఎండాలా, పండాలా? అనేది నిర్ణయిస్తుందని చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదివారం కోదాడలో బీఆర్‌ఎస్‌ ప్రజా ఆశీర్వాద సభ నిర్వహించింది. ఈ సభకు సీఎం కేసీఆర్‌ హాజరై ప్రసంగించారు.

గోల్‌మాల్‌ చేసి దిగువకు తీసుకొచ్చారు
తెలంగాణ రాకముందు 2003లో సాగర్‌ నీళ్ల కోసం రైతులు తన  దగ్గరకు వచ్చినట్లు సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. 24 గంటల్లో నీళ్లు ఇవ్వాలని అప్పటి ప్రభుత్వానికి వార్నింగ్‌ ఇచ్చినట్లు ప్రస్తావించారు. నాగార్జున సాగర్‌ పేరు నదిగొండ ప్రాజెక్టని తెలిపారు. ఏలేశ్వరం దగ్గర ప్రాజెక్టు కట్టాల్సి ఉండగా.. గోల్‌మాల్‌ చేసి 20 కిలోమీటర్లు దిగువకు తీసుకొచ్చి నాగార్జున సాగర్‌ ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. దీంతో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరిగిందని అన్నారు.

దద్దమ్మల్లా మారు మాట్లాడలేదు
మనం కట్టాలనుకున్న ప్రాజెక్టును ఆపిందెవరని సీఎం కేసీఆర్‌ ప్రశ్నించారు. ప్రాజెక్టును ఆపితే నోర్మూసుకొని కూర్చున్నదెవరని నిలదీశారు.. ఇంత జరుగుతున్నా అప్పుడు తెలంగాణ కాంగ్రెస్‌ నాయకులు నోరు మూసుకుని పడి ఉన్నారని అన్నారు. దద్దమ్మల్లా మారు మాట్లాడలేదని మండిపడ్డారు. నాడు కాంగ్రెస్‌ పాలకులు చేసిన తప్పులకు ఇప్పుడు మనం శిక్ష అనుభవిస్తున్నామని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
చదవండి: సోనియా కాళ్లు మొక్కిన కేసీఆర్‌, తర్వాత రోజే మాట మార్చాడు: ఖర్గే

తెలంగాణకు అన్యాయం జరిగింది
‘2001లో నేను గులాబీ జెండా ఎగరేసి ఈ అన్యాయాలపై నిలదీసిన దాక అడిగిన మొగోడే లేడు. ఈ జిల్లాలో మంత్రులు లేకుండెనా..? చాలా మంది ఉండె. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రులతో ఎవరూ కొట్లాడలేదు. నల్గొడ జిల్లాకు నీళ్లు తేలేదు. రైతులు కోరితే మొన్న సాగర్‌నుంచి నీళ్లు విడుదల చేశాం. మరోసారి నీళ్లను విడుదల చేస్తాం.

కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లను ను రప్పించాలని కోరుతున్నారు. కాళేశ్వరం నీళ్లు వస్తే రెండు పంటలు పండుతాయి. మల్లయ్య యాదవ్‌ గెలవరంటూ చాలామంది అన్నారు. గెలవకున్నా పర్లేదు.. టికెట్‌ ఇస్తానని అని చెప్పాను. మలమలయ్య యాదవ్‌ను గెలిపిస్తే కోదాడలో బీసీ భవన్‌ కట్టిస్తా. నీళ్ల కోసం కోదాడనుంచి హలియా వరకు పాదయాత్ర చేశా. తెలంగాణకు బీఆర్‌ఎస్‌ శ్రీరామ రక్ష. 

డీకే శివకుమార్‌ వ్యాఖ్యలకు సీఎం కేసీఆర్‌ కౌంటర్‌
కాళేశ్వరం నీళ్లు కోదాడలో కనిపించడం లేవని భట్టి విక్రమార్క అంటున్నారు. కాంగ్రెస్‌ ఉంటే గోదావరి నీళ్లు ఇక్కడి వరకు వచ్చేవా?. రైతుల కోసం 24 గంటలు ఇస్తున్నాం. కాంగ్రెస్‌ నాయకులు 3 గంటలే కరెంట్‌ చాలని మాట్లాడుతున్నారు. కరెంట్‌ మూడు గంటలు కావాలా? 24 గంటలు కావాలా?. కర్ణాటకలో 5 గంటలు కరెంట్‌ ఇస్తున్నామంటూ కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. ధరణిని తీసేస్తామంటూ కాంగ్రెస్‌ నేతలు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్‌కు అధికారం ఇస్తే మొదటికే మోసం వస్తుంది’ అని కేసీఆర్‌ మండిపడ్డారు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement