
గాంధీ మార్గంలో పయనించాలి
జయంతి వేడుకల్లో జేసీ సత్యనారాయణ
రాంనగర్ : మహాత్మా గాంధీ ప్రపంచానికి చూసిన శాంతి, అహింస మార్గాన్ని ప్రతి ఒక్కరూ అనుసరించాలని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎన్.సత్యనారాయణ అన్నారు. ఆదివారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో 147వ జయంతి ఉత్సవాలను జ్యోతి వెలిగించి ప్రారంభించారు. ఈ సందర్భంగా గాంధీ చిత్ర పటానికి పూలమాలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాంధీజీ అహింసా మార్గాన్ని ఎచుకుని మానవ జాతి మనుగడకు మార్గం చూపిన మూల పురుషుడన్నారు. గాంధీ చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలన్నారు. మానవ సమాజం శాంతి, స్వచ్ఛత, క్షమాగుణం కలిగి ముందుకు సాగాలన్నారు. హింస వల్ల అంతా నష్టమేగాని ఏమి లాభం ఉండదని, దేశంలో నానాటికి హింసా ప్రవృత్తి పెరుగుతందని, దానిని విడనాడి శాంతియుత మార్గంలో నడవాలని సూచించారు. ప్రపంచంలో 800 కోట్ల మంది ప్రజలు గాంధీజీని స్మరించుకుంటున్నారన్నారు. అదనపు జాయింట్ కలెక్టర్ వెంకట్రావ్ మాట్లాడుతూ గాంధీజీ చూపిన సత్యం, అహింసా తత్వం మన దేశానికే కాకుండా ప్రపంచ దేశాలకు కూడా స్ఫూర్తిని ఇచ్చాయన్నారు. కార్యక్రమంలో డీఆర్వో రవి, డ్వామా పీడీ దామోదర్‌రెడ్డి, టీఎన్‌జీఓ ఉద్యోగ సంఘం జిల్లా అధ్యక్షులు పందిరి వెంకటేశ్వరమూర్తి, వీఆర్వోల సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.కె జాన్‌పాషా తదితరులు బాపూజీ సేవలను కొనియాడారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు, వివిధ కార్యాలయాల సిబ్బంది పాల్గొన్నారు.