
'ఎంపీలను రాళ్లతో కొడతాం'
బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ లో మాట్లాడని ఎంపీలపై మిలిటెంట్ దాడులకు సైతం వెనకాడబోమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు బీసీ నేత ఆర్. కృష్ణయ్య.
మహబూబ్ నగర్: బీసీ రిజర్వేషన్ల అంశంపై పార్లమెంట్ లో మాట్లాడని ఎంపీలపై మిలిటెంట్ దాడులకు సైతం వెనకాడబోమని తీవ్రస్థాయిలో హెచ్చరించారు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య. శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో విలేకరులతో మాట్లాడిన ఆయన.. బీసీల సమస్యలపై పని చేసేందుకు త్వరలో పార్టీ పెట్టేందుకు సన్నాహాలు జరుగుతున్నాయన్నారు.
'పార్లమెంట్‌లో బీసీల రిజర్వేషన్‌పై మాట్లాడని ఇరు రాష్ట్రాల ఎంపీలను రాళ్లతో కొడతాం. 1993 నుంచి అనేక మంది ముఖ్యమంత్రులు బీసీ క్రీమీలేయర్‌ను ప్రవేశపెట్టాలని ప్రయత్నించి, వెనుకడుగు వేశారు. కానీ సీఎం కేసీఆర్ మాత్రం నిరంకుశంగా క్రీమీలేయర్‌ను ప్రవేశపెట్టాలని చూస్తున్నారు. దీనిని మేం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం' అని కృష్ణయ్య అన్నారు. రాష్ట్రంలోని బీసీలకు వాటర్‌గ్రిడ్ వద్దని, ఉద్యోగాలు కావాలని, జనాభాలో 52 శాతం ఉన్న బీసీలకు విద్యా, ఉద్యోగ రంగాల్లో రిజర్వేషన్లు కల్పించాలని డిమాండ్ చేశారు.