‘నీట్’లో హౌస్‌సర్జన్లకు అవకాశం
కడప అర్బన్ :
నేషనల్ ఎలిజిబులిటీ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్)లో అర్హత కల్పించాలంటూ రాష్ట్ర వ్యాప్తంగా హౌస్ సర్జన్లు, జూనియర్ డాక్టర్లు చేపడుతున్న ఆందోళనలో భాగంగా కడప రిమ్స్‌లో గురువారం హౌస్ సర్జన్లు ఐపీ విభాగం ముందు ఆందోళన ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రధానంగా మూడు డిమాండ్లతో కూడిన సమస్యలను పరిష్కరించాలంటూ హౌస్ సర్జన్లు ఆందోళనకు దిగారు. 2016–17 బ్యాచ్‌లో హౌస్ సర్జన్లుగా ఉన్న తమకు వచ్చే ఏడాది మార్చి 31వ తేది వరకు ఉంటేనే నీట్‌లో అర్హత కల్పిస్తామని ప్రభుత్వం తేల్చి చెప్పడం సమంజసంగా లేదన్నారు.
తమకు ఎన్టీఆర్ యూనివర్శిటీ పరిధిలో 2017 ఏప్రిల్ 11వ తేది వరకు హౌస్ సర్జన్ల కోర్సు ముగుస్తుందని, 11 రోజులు తమకు అర్హతలో తక్కువగా ఉందని, ఆ విషయాన్ని ప్రభుత్వం గమనించి సవరించాలన్నారు. ఆర్టికల్ 371ను సవరించి ఒకే రాష్ట్రంలో కనీసం 15 సీట్లు కేటాయించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జీఓ నెం. 287 ప్రకారం హౌస్ సర్జన్ల స్టయిఫండ్‌ను తెలంగాణ రాష్ట్రంలో 15 శాతం పెంచారని, మన రాష్ట్రంలో ఇప్పటివరకు దాని గురించి పట్టించుకోలేదన్నారు. వైద్యులకు వైద్యానికి ఉపయోగపడే పనులు చేయించకుండా నర్సులు, ఎంఎన్‌ఓలు చేసే పనులను చేయిస్తున్నారని, దీన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం దిగి రావాలి
నీట్‌లో అర్హత కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం దిగి వచ్చి తమకు న్యాయం చేసేవరకు పోరాడతాం. ఆందోళనలో ఉ«ధతంగా పాల్గొని దశల వారీ ఉద్యమాలకు శ్రీకారం చుడతాం!
– డాక్టర్ మహేంద్ర, హౌస్ సర్జన్, రిమ్స్, కడప
నీట్‌లో అర్హత కల్పించాలి
దేశ వ్యాప్తంగా నిర్వహించే నీట్ పరీక్షలో 11 రోజులు మాత్రమే తక్కువగా ఉందని తెలిపారు. ఈ ఆలస్యానికి కూడా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీనే కారణం. ఆ విషయాన్ని గుర్తించి న్యాయం చేయాలి.
– డాక్టర్ శ్రీధర్, హౌస్ సర్జన్, రిమ్స్, కడప
ప్రజలకు న్యాయం చేయలేని పరిస్థితి
తమతో వైద్యానికి ఉపయోగపడే ట్రీట్‌మెంట్ పనులు చేయిస్తే అందరికీ బాగుంటుంది. కానీ నర్సులు, ఎంఎన్‌ఓలు చేసే పనులను చేయిస్తున్నారు. దీనివల్ల తాము డ్యూటీలకు వచ్చినప్పటి నుంచి కే షీట్లు చూడడం వరకే తప్ప రోగులకు వైద్య సేవలు అందించలేని పరిస్థితి నెలకొంది.
– డాక్టర్ నరేష్, హౌస్ సర్జన్ల అసోసియేషన్ అధ్యక్షులు, రిమ్స్, కడప
స్టయిఫండ్‌ను పెంచేలా చర్యలు తీసుకోవాలి
హౌస్ సర్జన్లకు ఇచ్చే స్టయిఫండ్‌ను ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జీఓ నెం. 287 ప్రకారం రెన్యూవల్ చేసి 15 శాతం పెంచాలి. అలాంటి చర్యలు ్ర’పభుత్వం చేపడితేనే తమకు న్యాయం జరుగుతుంది.
– డాక్టర్ బబిత, హౌస్ సర్జన్, రిమ్స్, కడప
నీట్‌లో అర్హత సాధించేంత వరకు పోరాటం
గుంటూరులో జూనియర్ డాక్టర్లు వారం రోజులుగా సమ్మె చేస్తున్నారని, వారి బాటలోనే తాము ఆందోళన చేపడతాం. ప్రభుత్వం తమకు నీట్‌లో అర్హత సాధించేలా లిఖిత పూర్వక హామి ఇచ్చేంతవరకు పోరాడుతాం!
– డాక్టర్ సరయు, హౌస్ సర్జన్, రిమ్స్, కడప
సౌకర్యాలు కల్పించాలి
వైద్య సిబ్బందితోపాటు తాము విధులు నిర్వర్తిస్తున్న సమయంలో అన్ని సౌకర్యాలు కల్పించాలి. ఒక్కొ సమయంలో కనీసం తాగేందుకు మంచినీరు కూడా లేకపోవడం దారుణం. అలాగే హాస్టల్ నుంచి విధులకు రావాల్సిన సమయంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం!
– డాక్టర్ ప్రియాంక, హౌస్ సర్జన్, రిమ్స్, కడప