ఏం తినాలి.. ఎలా బతకాలి?
- కదం తొక్కిన ఉపాధి కూలీలు
- డ్వామా కార్యాలయ ముట్టడికి యత్నం
- ఉపాధి బిల్లులు చెల్లించాలని డిమాండ్
అనంతపురం టౌన్ : నెలల తరబడి ఉపాధి బిల్లులు రాకుంటే ఏం తినాలి? ఎలా బతకాలంటూ కూలీలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బిల్లులు తక్షణమే ఇవ్వాలంటూ ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో బుధవారం జిల్లా నీటియాజమాన్య సంస్థ (డ్వామా) కార్యాలయ ముట్టడికి ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో గేట్ ఎదుట బైఠాయించి అధికారుల తీరుపై మండిపడ్డారు. ఈ సందర్భంగా సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్ మాట్లాడుతూ ప్రభుత్వం ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయడానికి ప్రయత్నిస్తోందన్నారు. నిబంధనల ప్రకారం 15 రోజుల్లో ఉపాధి కూలి డబ్బు ఇవ్వాల్సి ఉన్నా నెలల తరబడి కాలయాపన చేస్తోందన్నారు. జిల్లా యంత్రాంగం కాకిలెక్కలతో మభ్యపెడుతోందని మండిపడ్డారు. జిల్లా వ్యాప్తంగా మూడు నెలల నుంచి సక్రమంగా బిల్లులు రాక కూలీల కుటుంబాల పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. అధికారులకు ఒక నెల జీతం రాకుంటే తెగ హైరానా పడతారని, మరి కూలీల పరిస్థితి ఇంత దారుణంగా ఉంటే ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. వలసలను ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందన్నారు. ఉపాధి పనులను ఏడాదికి 200 రోజులు పెంచాలన్నారు. రోజు వేతనం రూ.300 ఇవ్వాలని, పోస్టాఫీసుల ద్వారానే చెల్లించాలని డిమాండ్ చేశారు. టీడీపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆ పార్టీ నేతలకు ‘ఉపాధి’ కల్పించేదిగా ఈ పథకాన్ని మార్చేశారన్నారు. డ్వామా పీడీ నాగభూషణం వచ్చి నాయకులతో మాట్లాడారు. గతంలో పోస్టాఫీసుల ద్వారానే బిల్లుల చెల్లింపులు జరిగేవని, జనవరి నుంచి నేరుగా బ్యాంక్ ఖాతాల్లోకే నగదు వేస్తున్నట్లు చెప్పారు. కూలీలందరి ఖాతాలు, ఆధార్ అనుసంధానం కాకపోవడంతో బిల్లుల చెల్లింపుల్లో జాప్యం జరుగుతున్నట్లు వివరించారు. ఈ విషయమై కలెక్టర్ వీరపాండియన్‌తో చర్చించామని, త్వరలోనే పరిష్కరిస్తామని చెప్పారు. ఎప్పుడు చెల్లిస్తారో స్పష్టం చేయాలని కూలీలు డిమాండ్ చేయడంతో మరో మూడు, నాలుగు వారాలు పడుతుందని పీడీ చెప్పారు. దీంతో వారు ఒక్కసారిగా ముందుకు తోసుకెళ్లారు. ఇప్పటికే ఆర్థిక ఇబ్బందులు పడుతుంటే మరో నాలుగు వారాలంటే ఎలాగని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంతలో టూటౌన్ సీఐ యల్లంరాజు ఆధ్వర్యంలో పోలీసులు నాయకులను అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పెద్దన్న, కృష్ణమూర్తి, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి నల్లప్ప తదితరులు పాల్గొన్నారు.