వరించేదెవరినో..!
-
దసరాలోపు కార్పొరేషన్ పదవులను ప్రకటించేందుకు సీఎం కసరత్తు
-
రేసులో ఈద శంకర్‌రెడ్డి, జీవీ.రామకృష్ణరావు, అక్బర్‌హుస్సేన్, మైఖేల్ శ్రీను
-
ఈద, జీవీకి కార్పొరేషన్ చైర్మన్ పదవులు ఖాయమనే ప్రచారం
-
మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ కోసం అక్బర్‌హుస్సేన్ ప్రయత్నాలు
కరీంనగర్ : అధికార టీఆర్‌ఎస్ పార్టీ నేతలను నామినేటెడ్ పదవులు మళ్లీ ఊరిస్తున్నాయి. దసరా కానుకగా కార్పొరేషన్ పదవులను భర్తీ చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయించినట్లు తెలిసింది. కార్పొరేషన్ పదవుల కోసం జిల్లా నుంచి ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఆశావహులు దరఖాస్తు చేసుకున్నారు. టీఆర్‌ఎస్ జిల్లా, రాష్ట్రస్థాయి నాయకులు, అనుబంధ సంఘాల నేతలు జిల్లా మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలతో సిఫారసు లేఖలు తీసుకుని సీఎంను కలిసి నామినేటెడ్ పదవులివ్వాలని కోరారు. ఇప్పటికే మార్కెట్ కమిటీలను భర్తీ చేస్తున్న కేసీఆర్ దసరాలోపు కార్పొరేషన్ పదవులను కూడా భర్తీ చేసేందుకు సిద్ధమయ్యారు. అందులో భాగంగా ఈసారి జిల్లాకు రెండు లేదా మూడు కార్పొరేషన్ చైర్మన్ పదవులు దక్కనున్నట్లు అధికార పార్టీలో జోరుగా ప్రచారం సాగుతోంది.
పార్టీ వర్గాల విశ్వసనీయ సమాచారం మేరకు... కార్పొరేషన్ పదవుల కోసం వందల కొద్ది దరఖాస్తులు వచ్చిన ప్పటికీ టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు ఈద శంకర్‌రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జీవీ.రామకృష్ణారావు, మైనారిటీ విభాగం జిల్లా అధ్యక్షుడు అక్బర్‌హుస్సేన్, రజక సంఘం నాయకుడు మైఖేల్ శ్రీను పేర్లు ఖారారైనట్లు తెలిసింది. వీరిలో ఈద శంకర్‌రెడ్డి, జీవీ.రామకృష్ణరావులకు కార్పొరేషన్ చైర్మన్ పదవి ఖాయమైనట్లు సమాచారం. ఈద శంకర్‌రెడ్డి గత ఎన్నికల్లో పెద్దపల్లి ఎమ్మెల్యే టిక్కెట్ ఆశించి భంగపడ్డారు. మానకొండూరు నియోజకవర్గానికి చెందిన జీవీ.రామకృష్ణారావు రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ లక్ష్మీకాంతరావుకు బంధువు. పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తున్న ఆయనకు కార్పొరేషన్ పదవి ఇవ్వాలని రాష్ట్ర, జిల్లాకు చెందిన పలువురు నేతలు సిఫారసు చేసినట్లు తెలిసింది. మిగిలిన ఇద్దరిలో అక్బర్‌హుస్సేన్ జిల్లా మైనారిటీ విభాగం చైర్మన్‌గా కొనసాగుతున్నారు. కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేటర్‌గా పోటీ చేసి ఓడిపోయారు. మైఖేల్ శ్రీను పార్టీలో సుదీర్ఘ కాలంగా క్రియాశీల కార్యకర్తగా కొనసాగుతున్నారు. జిల్లా రజక సంఘం నాయకుడిగా ఉన్నారు. వీరిద్దరితోపాటు జిల్లాకు చెందిన మరో నాయకుడికి కార్పొరేషన్ డైరెక్టర్ పదవులు దక్కనున్నట్లు సమాచారం.
అయితే తనకు మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇవ్వాలని అక్బర్‌హుస్సేన్ పెద్ద ఎత్తున లాబీయింగ్ చేస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీతోపాటు జిల్లాకు చెందిన మంత్రులు, ఎంపీలను కలిసి విజ్ఞప్తి చేశారు. మరోవైపు పార్టీకి ఏళ్ల తరబడి సేవలు చేస్తున్న నేతల పేర్లు జిల్లాల వారీగా ఇప్పటికే తెప్పించుకున్న కేసీఆర్ అందులో ఎవరెవరికి కార్పొరేషన్ ఛైర్మన్, డైరెక్టర్ల పదవులను కట్టబెట్టాలనే అంశంపై ఇప్పటికే జాబితాను కూడా సిద్ధం చేసినట్లు తెలిసింది. ముఖ్యంగా గత ఎన్నికల్లో ఎమ్మెల్యే టిక్కెట్లు ఆశించి భంగపడిన వాళ్లు, రాబోయే ఎన్నికల్లో మళ్లీ టిక్కెట్ ఇచ్చే అవకాశాల్లేని వారిని కార్పొరేషన్ పదవులతో సంతృప్తిపర్చాలని కేసీఆర్ భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయాన్ని వారికి స్పష్టంగా చెప్పిన తరువాతే జాబితాను విడుదల చేస్తారని తెలుస్తోంది. మొత్తమ్మీద దసరా లోపు పేర్లను ప్రకటించనున్నట్లు అధికార పార్టీ వర్గాల సమాచారం.