నా భర్త నాక్కావాలి
నా భర్త నాక్కావాలి
Published Sat, Oct 1 2016 9:20 PM | Last Updated on Thu, Oct 4 2018 5:35 PM
–బిడ్డతో సహా యువకుడి ఇంటి ముందు బైఠాయింపు
– హైదరాబాద్ నుంచి విస్సన్నపేటకు
– ఫేస్‌బుక్ ప్రేమలో అనూహ్య మలుపులు
– యువకుడి తల్లి ఆత్మహత్యాయత్నం
విస్సన్నపేట :
ఫేస్‌బుక్ పరిచయం.. ప్రేమ ఆటుపోట్లకు గురవుతోంది. ప్రేమించి పెళ్లాడిన యువకుడు చివరకు ముఖం చాటేయడంతో ఆ అభాగ్యురాలు తన భర్త తనక్కావాలని ఆందోళనకు దిగింది. ఈ ఘటన మండల కేంద్రంలో కలకలం రేపుతోంది. వివరాల్లోకి వెళితే.. విస్సన్నపేటకు చెందిన డి.రాకేష్ అనే యువకుడికి హైదరాబాద్‌కు చెందిన జ్యోతి 2011లో ఫేస్‌బుక్ ద్వారా పరిచయమైంది. ఖమ్మం జిల్లాకు చెందిన ఆమె హైదరాబాద్‌లో ఉంటూ నర్సింగ్ పూర్తిచేశారు. రాకేష్ హైదరాబాద్‌లోనే తన బంధువుల ఇంట్లో ఉంటూ బీటెక్ చదువుతుండడంతో ఇద్దరూ తరచూ కలిసేవారు, ఆ పరిచయం ప్రేమగా చిగురించింది. తామిద్దరు గుళ్లో పెళ్లి చేసుకున్నట్లు ఆమె తెలిపారు. వీరికి 11 నెలల కుమారుడున్నాడు.
తిరిగిరాని భర్త కోసం....
గత నెల 13న రాకేష్ తన బాబాయికి బాగోలేదని చెప్పి విజయవాడకు వచ్చాడు. ఆ తర్వాత తిరిగిరాలేదు. ఎన్నిసార్లు ఫోన్‌చేసినా స్పందించడం లేదు. దీంతో ఆందోళనకు గురైన జ్యోతి నేరుగా విస్సన్నపేటకు వచ్చేసింది. తనకు న్యాయం చేయాలంటూ చంటి బిడ్డతో, బంధువులతో కలిసి శనివారం సాయంత్రం రాకేష్ ఇంటి ఎదుట బైఠాయించింది. ఈ విషయమై తాను గతంలో ఖమ్మం జిల్లా వీఎం బంజరలో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని బాధితురాలు తెలిపింది.
రాకేష్ తల్లి ఆత్మహత్యాయత్నం
ఈ ఘటనతో కలవరానికి గురైన రాకేష్ తల్లి మనస్తాపంతో పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా,వెంటనే నూజివీడు ప్రైవేట్ ఆస్పత్రికి తరలించినట్లు బంధువులు తెలిపారు. ఇక రాకేష్ పట్టణంలోనే ఎక్కడో గుట్టుగా తలదాచుకున్నట్లు తెలుస్తోంది.
Advertisement
Advertisement