భర్త ఇంటి ఎదుట భార్య ఆందోళన
– పెళ్లినాటి నుంచి వేధింపులేనని కన్నీరు మున్నీరు
– న్యాయం చేయాలని వేడుకోలు
– మద్దతుగా నిలిచిన ప్రజాసంఘాలు
కోదాడ
అదనపు కట్నం కోసం ఇంటి నుంచి వెళ్లగొట్టి కాపురానికి తీసుకెళ్లడం లేదని ఆరోపిస్తూ ఓ వివాహిత తన తల్లిదండ్రి, ప్రజాసంఘాల నేతలతో కలిసి భర్త ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. దీంతో భర్త కుటుంభ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయారు. కోదాడలో మంగళవారం చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి బాధితుల కథనం ప్రకారం.. కోదాడకు చెందని సుబ్బారావు– పద్మల కుమార్తె అరుణను ఇదే పట్టణానికి చెందిన ఓరుగంటి వెంకటేశ్వర్లు కుమారుడు దీప్తుకుమార్‌తో మూడు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. మూడు నెలల వరకు సజావుగానే ఉన్నా ఆ తరువాత భర్త తనను నిత్యం అనుమానించడమే కాకుండా అదనపు కట్నం తెమ్మని మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నాడని ఆమె రోదిస్తూ చెప్పింది. పెద్ద మనుషులను పిలిపించి సర్ది చెప్పిన తరువాత కాపురానికి తీసుకెళ్లాడని పేర్కొంది. కొద్ది రోజులకే మళ్లీ వేధించడం మొదలు పెట్టి, కొట్టి ఇంటి నుంచి గెంటివేశాడని వాపోయింది. తనకు న్యాయం చేసే వరకు ఆందోళన కొనసాగిస్తానని చెప్పారు. ఈ ధర్నాలో అరుణ తల్లిదండ్రులతో పాటు నాయకులు కుక్కడపు బాబు, కందిబండ శ్రీను, బెలిదె అశోక్, హుస్సేన్‌రావు, పందితిరపతయ్య, పిట్టల భాగ్యమ్మ, కర్ల సుందర్‌బాబు, నెమ్మాది భాస్కర్ పాల్గొన్నారు.