ఎస్సై రెండో ఇంటి ముందు భార్య ఆందోళన | ASI wife protest at his husband second house | Sakshi
Sakshi News home page

ఎస్సై రెండో ఇంటి ముందు భార్య ఆందోళన

Published Wed, Nov 4 2015 8:18 PM | Last Updated on Mon, Aug 20 2018 5:11 PM

ASI wife protest at his husband second house

నల్లకుంట(హైదరాబాద్):  ఓ ఎస్సై తన భార్యపై వేధింపులకు గురి చేసిన ఘటన అంబర్‌పేట పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం చోటు చేసుకుంది. అదనపు కట్నం తేవాలని డిమాండ్ చేయడంతో పాటు, మరొకరితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను పట్టించుకోవటం లేదంటూ ఎస్సై రెండో ఇంటి వద్ద భార్య ఆందోళనకు దిగింది.

వివరాల్లోకి వెళితే... హైదరాబాద్‌లో ఎస్సైగా పనిచేస్తున్న నల్గొండ జిల్లా గరిడేపల్లి మండలం కొత్తగూడంకు చెందిన ఎన్.కరుణ కుమార్తో అదే జిల్లా హుజూర్‌నగర్‌కు చెందిన నందిపాటి సాల్మన్, లలితల కుమార్తె విజయరాణితో 2011లో వివాహం జరిగింది. వివాహ సమయంలో కరుణ కుమార్‌కు కట్నంగా రూ. 15 లక్షల నగదు, రూ. 3 లక్షల బంగారంతో పాటు రూ. 2 లక్షలు బ్యాంక్‌లో డిపాజిట్ చేశారు. ఏడాదిన్నర పాటు వారి సంసారం సాఫీగానే సాగింది. కాగా, వారికి కూతురు అక్షయ(3) ఉంది.

ఇదిలా ఉండగా, 2013 నుంచి కిమ్స్ ఆస్పత్రిలో నర్స్ గా పనిచేస్తున్న అనూషతో కరుణ కుమార్ వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడు. అప్పటి నుంచి భార్యను కట్నం కోసం వేధించటంతోపాటు పట్టించుకోవటం మానేశాడు. ఈ విషయమై 2014లో గాంధీనగర్ పోలీస్ స్టేషన్ లో బాధితురాలు ఫిర్యాదు చేయగా... ఎస్సైని విధుల్లోంచి సస్పెండ్ చేశారు. తిరిగి విధిల్లో చేరిన అతను ప్రస్తుతం అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ లో ఎస్సైగా పనిచేస్తున్నాడు. అయినా వేధింపులు మానక పోవడంతో బాధితురాలు సంతోష్‌నగర్ పోలీస్ స్టేషన్ లో మరోమారు ఫిర్యాదు చేసింది. అక్కడి అధికారులు కౌన్సెలింగ్ ఇచ్చినప్పటికీ అతనిలో మార్పు రాలేదు.

ఏడాది కాలంగా ఇంటికి సరిగా రాకుండా డీడీ కాలనీ జయరాజ్ అపార్ట్‌మెంట్‌లో ఉంటున్న నర్స్ అనూష వద్దకు వెళుతున్నాడు. దీంతో బాధితురాలు కూతురు అక్షయను తీసుకుని, ఎమ్మార్పీఎస్ నాయకులతో కలిసి బుధవారం ఉదయం కరుణ కుమార్, అనూష ఉంటున్న ఇంటి వద్ద ఆందోళనకు దిగింది. తనకు న్యాయం జరిగి, భర్త తన వద్దకు వచ్చే వరకు న్యాయ పోరాటం కొనసాగిస్తానని విజయరాణి పేర్కొంది. విషయం తెలుసుకున్న అంబర్‌పేట పోలీసులు వెంటనే అక్కడకు చేరుకుని, బందోబస్తు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా తనకు న్యాయం చేయాలని విజయరాణి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా, తన ఇంటిపై దాడి చేసి అసభ్యంగా ప్రవర్తించారంటూ అనూష.. విజయరాణిపై అంబర్‌పేట పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ రవీందర్‌రెడ్డి తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement