ఏపీని అన్ని విధాలా ఆదుకుంటాం
-
రూ.22 వేలకోట్లు రెవెన్యూలోటు భర్తీ కేంద్రానిదే బాధ్యత
-
నెల్లూరులో ఎన్‌సీఈఆర్‌టీ త్వరలో ఏర్పాటు
-
కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు
వెంకటగిరి: రాష్ట్ర విభజనతో నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌ను కేంద్రప్రభుత్వ అన్ని విధాలుగా ఆదుకుంటున్నట్లు కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వెంకటగిరిలో ఆదివారం కృషివిజ్ఞానకేంద్రానికి ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ 14వ ఆర్థికసంఘం సూచనల మేరకు ప్రత్యేకహోదా కాకుండా రాష్ట్రానికి ప్రత్యేక ప్యాకేజీ అమలు చేస్తున్నట్లు చెప్పారు. ప్రత్యేక హోదాకన్నా ప్రత్యేక ప్యాకేజీతోనే రాష్ట్రానికి మేలు జరుగుతుందన్నారు. ఆంధ్రప్రదేశ్ విభజనఽతో ఏర్పడిన రూ.22 వేలకోట్లు రెవెన్యూ లోటును కేంద్రప్రభుత్వం ఐదేళ్లలో భర్తీ చేసేందుకు అంగీకరించిందన్నారు. ఇప్పటికే రెండు విడతలుగా నిధులు విడుదల చేసినట్లు తెలిపారు. దక్షణ భారత దేశంలో రెండోదిగా నెల్లూరులో ఎన్‌సీఈఆర్‌టీ ( నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ రీసెర్చ్ ట్రయినింగ్ సెంటర్ )కు త్వరలో సీఎం చంద్రబాబు నాయుడుతో కలిసి శంకుస్థాపన చేస్తామని తెలిపారు. విజయవాడ నుంచి చెన్నై వరకూ ఉన్న డబుల్ రైల్వేలైన్‌ను ఆధునీకరించి ట్రిపుల్‌లైన్‌గా ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. కృషివిజ్ఞానకేంద్రం ద్వారా పరిశోధనలు జరిగి ఈ ప్రాంతానికి అనుకూలమైన పంటలు, సాగువిధానాలు రూపొందించే వీలుంటుందన్నారు. రైతులకు శిక్షణ ఇచ్చేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో ఈ కేంద్రన్ని ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. అంతకుముందు అదేప్రాంగణంలో పట్టణంలో ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులతో నిర్మించిన సిమెంట్‌రోడ్లు తదితర అభివృద్ధి కార్యక్రమాలకు ఏర్పాటు చేసిన శిలాఫలకాలను ఆవిష్కరించారు. రాష్ట్రమంత్రులు పత్తిపాటి పుల్లారావు, పొంగూరు నారాయణ, కామినేని శ్రీనివాస్, జెడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్రరెడ్డి, తిరుపతి ఎంపీ వెలగపల్లి వరప్రసాద్‌రావు, స్థానిక ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ, మాజీ ఎమ్మెల్యే సాయికృష్ణ యాచేంద్ర, నేదురుమల్లి రామ్‌కుమార్‌రెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ దొంతుశారద, డాక్టర్ వైఎస్సార్ ఉద్యానశాఖ విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ బీఎంసీ రెడ్డి. కలెక్టర్ ముత్యాలరాజు పాల్గొన్నారు.