టీడీపీ ఎమ్మెల్యే ఇంటి ముందు
బీసీ కార్పొరేషన్ రుణం ఇప్పించలేదని మనస్తాపం
రేపల్లె: ‘టీడీపీ ఆవిర్భావం నుంచి కార్యకర్తగా కొనసాగుతున్నాను. వార్డు మెంబరుగా పోటీ చేసి ఓడిపోయాను. మరోవైపు ఆడపిల్లల పెళ్లిళ్లతో అప్పుల పాలయ్యాను. సొంత పార్టీ ఎమ్మెల్యే కదా రుణం ఇప్పించకపోతారా అనే ఆశతో వెళితే.. మొండి చెయ్యే చూపించాడు. ఈ అప్పుల ఊబి నుంచి బయటపడటం నా వల్ల కాదు. ఈ పరిస్థితుల్లో నాకు ఆత్మహత్యే శరణ్యం’ అంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే ఇంటి ముందే ఓ మహిళ పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఈ ఘటన గుంటూరు జిల్లా రేపల్లె ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఇంటి ఆవరణలో సోమవారం జరిగింది. నిజాంపట్నం మండలం కొత్తపాలెం పంచాయతీ నక్షత్రనగర్‌కు చెందిన నాగిడి విజయలక్ష్మికి ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు .
ఆమె భర్త చేపల వేటకు వెళుతుంటాడు.ఈ నేపథ్యంలో కుటుం బ ఆర్థిక పరిస్థితులు పూర్తిగా దెబ్బతినడంతో బీసీ కార్పొరేషన్ నుంచి రుణం కోసం ఎమ్మెల్యేను ఆశ్రయించి పలుమార్లు తిరిగింది. సోమవారం మరోసారి ఎమ్మెల్యేకి తన గోడు చెప్పుకునేందుకు వెళ్లగా.. గ్రామ సర్పంచ్‌ను కలవాలని సూచించి ఆయన వెళ్లిపోయారు. అంతకుముందే సర్పంచ్ వద్దకు ఆమె పలుమార్లు వెళ్లగా, ఆయన తన బంధువులకు రుణాలు ఇప్పించుకుంటున్నాడే తప్ప పట్టించుకోలేదు. ఎమ్మెల్యే కూడా సర్పంచ్‌నే కలవమనడంతో మనస్తాపం చెందిన ఆమె తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. అక్కడున్న వారు స్పందించి స్థానిక ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ప్రస్తుతంచికిత్స పొందుతోంది.