కోలారు(కర్ణాటక): స్థానిక జాతీయ రహదారిపై ఉన్న పవన్ కళాశాల వద్ద సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందింది. ముందు వెళ్తున్న లారీని స్కార్పియో వాహనం ఢీ కొనడంతో ఈ ప్రమాదం సంభవించింది. మృతి చెందిన షేక్ అఫీజా (44)ది ఆంధ్రప్రదేశ్‌లోని కడప జిల్లా రాజంపేట పట్టణంలోని ఉస్మాన్‌నగర్. రాజంపేటకు చెందిన వీరు చెన్నై నుంచి బెంగళూరుకు స్కార్పియో వాహనంలో వెళ్తున్న సమయంలో ముందు వెళుతున్న వాహనం అకస్మాత్తుగా తిరగడంతో ఢీకొంది. ఘటనలో షేక్ అఫీజా మరణించగా, భర్త జిలాని తీవ్రంగా గాయపడి ఆర్‌ఎల్ జాలప్ప ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. విషయం తెలిసిన వెంటనే నగర పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. పొలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.